Car Hit Constables in Kirlampudi : రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా, వాడకాన్ని కట్టడి చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు కూడా వీటి నియంత్రణపై దృష్టి సారించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో చెక్ పోస్టులను పెంచి సోదాలను ముమ్మరం చేశారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేసి స్మగర్ల గుట్టును రట్టు చేస్తున్నారు.
మరోవైపు గంజాయి ముఠాలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. వారి పనికి అడ్డువస్తే ఏం చేయడానికి వెనుకాడటం లేదు. కొన్ని సార్లు స్మగ్లర్లు ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి.సతీష్, కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సుమారు ఒంటి గంటన్నర సమయంలో విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును వారు ఆపారు.
ఈ నేపథ్యంలోనే కారుని చుట్టుముట్టిన పోలీసులు డ్రైవర్ని వివరాలు అడుగుతున్నారు. ఈ లోపు ఫాస్టాగ్ ద్వారా టోల్ పన్ను చెల్లించడం, టోల్ గేటు తెరుచుకోవడంతో కారు అతి వేగంగా ముందుకు దూసుకెళ్లింది. వాహనం ముందు నిలుచున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్ను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే అప్రత్తమైన పోలీసులు జాతీయ రహదారిపై కారును వెంబడించారు.
krishnavaram Toll Plaza Viral Video : ఈ క్రమంలో దుండగలు రాజానగరం వద్ద కారును వదిలేసి పరారయ్యారు. కారు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జీలుగుమిల్లి వద్ద నిందితులిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.