CM Chandrababu Chit Chat On Ys Jagan Seci Fraud : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సెకితో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్ల రూపాయలలో ముడుపులు తీసుకున్నట్టు జగన్‌పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డూలాంటి అవకాశమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కక్ష తీర్చుకోవడం, జగన్‌ను అరెస్ట్ చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనిచేసేవాడినన్నారు. రాజకీయ కక్షసాధింపు తన లక్ష్యం కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులకూ తమకూ ఉన్న తేడా అదేనని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో సెకితో ఒప్పందం అంశాలపై చంద్రబాబు మాట్లాడారు.
ఇప్పుడే చర్యలకు దిగలేం : సెకి ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని సీఎం తెలిపారు. జగన్‌పై చర్య తీసుకోవాలంటే ఆయన ఎదుర్కొంటున్న అభియోగాలు నిర్ధారణ కావాలన్నారు. దీనిపై మరింత స్పష్టతకు వచ్చేవరకు చర్యలకు దిగలేమని అన్నారు. జగన్ ప్రభుత్వం లేనిపోని భూవివాదాల్ని రేకెత్తించి తేనెతుట్టెను కదిపిందని, వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని సీఎం తెలిపారు. తమకు వస్తున్న వినతుల్లో అత్యధికం భూవివాదాలవేనని, రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాక వాటిపై చాలా వరకు స్పష్టత వస్తుందన్నారు.
పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుడికి సీఎం హామీ - 2 రోజుల్లో నెరవేర్చిన అధికారులు
తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని చంద్రబాబు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలోని పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. సింహాచలం దేవస్థానం భూములని, వాటికి బదులు దేవస్థానానికి అంతే విలువగల ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని తెలిపారు. ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి, దీన్ని సున్నితంగా పరిష్కరించాలన్నారు. 2014-19 మధ్య విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్ని అంతర్జాతీయ స్థాయికి తెచ్చామని సీఎం గుర్తుచేశారు. గత ఐదేళ్లలో అది రివర్సైందని మండిపడ్డారు. విజయవాడ, తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అమరావతి అభివృద్ధి చెందే నగరం - ఇక సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు
2024 చరిత్ర తిరగరాసింది - అందరికీ భవిష్యత్‌పై భరోసా వచ్చింది: సీఎం చంద్రబాబు