ప్రభుత్వ విద్యా సంస్థల ఆవరణలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని.. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను ఉన్న స్థితిలోనే ఆపేయాలన్న హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అనంతపురం జిల్లా గాండ్లపెంటలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. గాండ్లపెంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రభుత్వం గ్రామ సచివాలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఇటీవల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఇతర కార్యాలయాలు నిర్మించవద్దని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గాండ్లపెంటలో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతటితో ఆగని అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యుడు సిద్ధారెడ్డి గ్రామ సచివాలయం ప్రారంభించారు. ఇప్పటికే ఆ పాఠశాల ఆవరణలోనే రైతు భరోసా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తుండడం గమనార్హం.
సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, మండల పరిషత్, సచివాలయ సిబ్బంది అధికార పార్టీ నాయకులతో పాటు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. సచివాలయ భవనం నిర్మించిన ప్రదేశం పాఠశాలకు సంబంధం లేదంటూ శాసనసభ్యుడు చెప్పుకొచ్చారు. ఈ ప్రదేశాన్ని గతంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి రక్షిత నీటి పథకం ఏర్పాటు కోసం గ్రామపంచాయతీ అధికారులు తీర్మానం చేశారన్నారు. ఆ ప్రదేశంలోనే సచివాలయ భవనం నిర్మించామని సిద్ధారెడ్డి తెలిపారు. రక్షిత నీటి పథకం నిర్మాణం ఏర్పాటు కోసం గ్రామపంచాయతీ అనుమతి తీసుకున్నట్లు చెప్పిన శాసనసభ్యుడు.. సచివాలయ భవన నిర్మాణానికి ఎందుకు అనుమతి తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు.
ఇదీ చదవండి