DD Tower Service Withdrawn : అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముప్ఫై ఏళ్లపాటు టీవీ ప్రేక్షకులకు సేవలను అందించిన దూరదర్శన్ టవర్ సేవలు ఇకపై నిలిచిపోనున్నాయి. కేబుల్ నెట్ వర్క్ లేని సమయంలో ఇంటి మిద్దెలపై పెట్టుకునే టీవీ యాంటీనాలకు సిగ్నల్ అందించిన ఈ టవర్ పరిజ్ఞానం ప్రస్తుతం కాలం చెల్లిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇటువంటి టవర్లను ఇప్పటికే తొలగించారు. ఇప్పుడు తాజాగా అనంతపురంలో ఈనెల 31 నుంచి దూరదర్శన్ సిగ్నల్ నిలిపివేయనున్నారు.
అనంతపురం జిల్లాలో చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధి వరకు దూరదర్శన్ సిగ్నల్ ద్వారా ప్రజలకు వినోదాన్ని చేరువ చేసిన టవర్ నుంచి ఈనెల 31న సిగ్నల్ ఆగిపోనుంది. 1990 సెప్టెంబర్ 14న కోరమాండల్ సిమెంట్ కంపెనీ..కోటి రూపాయల వ్యయంతో 150 అడుగుల ఎత్తుతో ఈ టవర్ నిర్మించింది. అప్పటి నుంచి దూరదర్శన్ ప్రేక్షకులకు పలు కార్యక్రమాలు ప్రసారం చేయటానికి ఈ టవర్ కీలకంగా ఉండేది. కాలక్రమంలో కేబుల్ టీవీ నెట్ వర్క్, డీటీహెచ్ అందుబాటులోకి రావటంతో దూరదర్శన్ ప్రసారాలు కూడా వీటి ద్వారానే వీక్షించే అవకాశం ఏర్పడింది. హైపవర్ ట్రాన్స్‌మిషన్ టెర్రస్త్రీరియల్ సిగ్నల్ టవర్ అవసరం లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా టవర్లను అంచెలంచెలుగా తొలగిస్తూ వచ్చారు.
అనంతపురంలోని టవర్ నుంచి ఈనెల 31న అర్ధరాత్రి నుంచి సిగ్నల్ నిలిపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోని అరుదైన టవర్లలో నగరంలో నిర్మించిన సిమెంట్ టవర్ ఒకటి. ఎఫ్.ఎం. రేడియో ప్రసారాలు మాత్రం ఈ టవర్ నుంచి కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
సిగ్నల్ నిలిపివేస్తే..ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని మరో చోటుకి బదిలీ చేయటం కానీ, స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా!