CPM state secretary fire on YCP govt: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అధికార పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను తప్పి, మడమ తిప్పి ఉద్యోగులను ఘోరంగా మోసం చేశారని ఆవేదన చెందారు. 'జీపీయస్ వద్దు.. ఓపీయస్ ముద్దు' అని ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘంగా ఉద్యమాలు, రాస్తారోకోలు చేస్తునప్పటికీ సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను వెల్లడించారు. మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు, ఉద్యోగుల విషయంలో నిజమైన సమాధానాలను చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనపై అన్ని విధాలుగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయని.. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించటం కోసం వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో దొంగ ఓట్లతో గెలవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి నెలలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను కూడా జగన్ ప్రభుత్వం వాయిదా వేసిందని వ్యాఖ్యానించారు. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదని, ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా, స్వేచ్ఛగా జరపాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందని ఆయన గుర్తు చేశారు. అలా జరగని పక్షంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు అడ్డుకుని తీరుతారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఆస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం ఉద్యోగులను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ భయపెడుతున్నారన్నారని ఆగ్రహించారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఏకంగా విందు భోజనాలు పెట్టారని ఆయన గుర్తు చేశారు. వాళ్లే విచారణ చేసి.. ఏమీ లేదని సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం సాయంతో రిగ్గింగ్‌కు కూడా సిద్దమవుతున్నారన్నారు. సహకరించని అధికారులను బెదిరించి, బదిలీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి తమకు నడుమలు ఉన్నాయి, వెన్నెముక ఉందని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో అరాచక శక్తులు రోజురోజుకు చెలరేగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటంలేదని శ్రీనివాసరావు ఆవేదన చెందారు.
ఇవీ చదవండి