పట్టణాల్లోని రహాదారుల మధ్యలో రకారకాల మెుక్కలు చూపరులను ఆకర్షించటం సాధారణమే...మరింతగా సుందరంగా ఆకట్టుకోవాలంటే ఏదో చేయాలని అనంతపురం జిల్లాధికారులు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన కూడలి రహదారిలో డివైడర్ల మధ్యలో 12 రకాల సూర్య నమస్కారాలు, యోగాల కు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు వాహనదారులను, పాదచారులను ఆకట్టుకుంటున్నాయి. నగర అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన వీటిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అనంతపురం నగరపాలక అధికారులు బొంబాయి పర్యటన వెళ్లినప్పుడు అక్కడ అభివృద్ధిని పరిశీలించి జిల్లాలో అలాంటి అభివృద్ధిని ప్రజలకు చూపించాలనుకున్నారు. ఆకర్షణగా ఉన్న సూర్య నమస్కారాలు విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 12 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేశారు.
సూర్యుని విశిష్టతను తెలిపే ఈ 12 రకాల విగ్రహాల ప్రత్యేకతను ప్రజలు తెలుసుకోవాలనే సదుద్దేశంతో వీటిని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అలాగే ఆరోగ్యం-మహాభాగ్యం అన్న సూక్తి తో ప్రతి ఒక్కరు నిత్యం యోగాని అనుసరించేవారికి ఈ విగ్రహాలు ఆదర్శంగా కనువిందు చేస్తున్నాయి.
