శాసనసభ సమావేశాల్లో తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ.. అనంతపురం జిల్లాలో ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అంతకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదర్ వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై మనస్థాపం చెంది పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ తెలుగుదేశం అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వరరావు అనే తెదేపా కార్యకర్త పురుగుల మందు సేవించాడు. అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే పురుగుల మందు తాగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కంటతడి పెట్టిన చంద్రబాబు
శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు సభలో ఏకంగా తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్ కూడా అవహేళనగా మాట్లాడారన్నారు.
‘‘నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా." అని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
ధర్మపోరాటంలో సహకరించండి
"నా భార్యను కించపరిచేలా నిండు సభలో వ్యాఖ్యలు చేశారు. ఆమె గురించి అసభ్యంగా మాట్లాడారు. ఆమె త్యాగం, నా పోరాటం ప్రజలకు తెలుసు. మీ ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడితే..ఎంత బాధపడతారో గుర్తుంచుకోండి. అదే నా ఆవేదన. రెండున్నరేళ్లుగా మమ్మల్ని బండ బూతులు తిడుతున్నారు. మా పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించారు. గత ఎన్నికల్లో మాకు 23, వైకాపాకు 151 స్థానాల్లో ప్రజలు విజయాన్ని కట్టబెట్టారు. నేనేం తప్పు చేశానో ప్రజలకే తెలియాలి. శాసనసభలో మైక్ ఇవ్వకుండా అవమానించారు. నా మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు స్పీకర్గా వ్యహరిస్తున్న తమ్మినేని విజ్ఞత లేకుండా మైక్ కట్ చేశారు. చీఫ్ విప్ శానససభ వాయిదా వేయమనగానే వాయిదా వేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీ సీఎం వ్యక్తిగతంగా ఏం ఆశించరు..కేవలం ప్రజల కోసమే పనిచేస్తారనే కితాబిచ్చారు. అప్పట్లోనే నన్ను కేంద్రంలోకి ఆహ్వానించారు. కొత్తగా నాకు పదవులు, రికార్డులు అక్కర్లేదు. రామాయణంలో రాక్షసులు ఏం చేశారో చూశాం. దేవతల దగ్గర వరం తీసుకున్న భస్మాసురుడు ఏం చేశారో చూశాం. గతంలో తరిమెల నాగిరెడ్డి, ఎన్టీ రామారావు తాము చెప్పదలచినది చెప్పి సభ నుంచి బయటకు వచ్చారు. నేను కూడా క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతా. ఈ ధర్మపోరాటంలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా." -చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి