FLOODS IN ANANTAPUR : నడిమివంక బీభత్సంతో అతలాకుతలమైన అనంతపురం నగరంలోని ప్రజల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. వర్షం కాస్త తెరిపివ్వడంతో బాధితులు శిబిరాల నుంచి తిరిగి తమ తమ ఇళ్లకు వచ్చి చూసుకుంటున్నారు. బురదను శుభ్రం చేసుకుంటున్నారు. అయితే ఇళ్లలోని సామగ్రి పూర్తిగా పాడైపోయింది. మిగిలి ఉన్న అరకొర వస్తువులు సైతం ఎందుకూ పనికి రాకుండాపోయాయి. ఇంకా మోకాళ్లలోతు నీటిలోనే నివాసాలు ఉండటంతో.. ఏం చేయాలో తెలియట్లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
"ఇచ్చే రెండు వేల కోసం ఆధార్, ఓటర్ కార్డులు అడిగితే మేము ఎక్కడ నుంచి తీసుకురావాలి. కట్టుబట్టలతో బయటికి వచ్చాము. ఇంట్లో ఉండే అన్ని వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. వాళ్లు అడిగిన కాగితాల కోసం వెళ్తే బతికి ఉంటామన్న నమ్మకం లేదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులకు మేము గుర్తుకువస్తాము. మేము ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి. మేము వరదలతో అల్లాడుతుంటే.. సాయం కావాలంటే కార్డులు అడుగుతున్నారు. ఇన్ని షరతులతో ఇచ్చే సాయం మాకు అక్కర్లేదు" -వరద బాధితులు
వరదలతో సర్వం కోల్పోయాయంటున్న బాధితులు.. ప్రభుత్వం నుంచి కనీస సాయం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2వేల రూపాయల సాయం కోసం ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లాంటి ధ్రువపత్రాలు తీసుకురమ్మంటున్నారని.. అంతా నీటిలో కొట్టుకుపోతే తామెక్కడి నుంచి తేగలమని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని షరతులతో ఇచ్చే సాయం తమకు అక్కర్లేదని చెబుతున్నారు.
ముంపు ప్రాంతాల్లోనే ఉంటున్న తమకు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్నా.. అధికారులు ఇప్పటివరకు కనీసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయలేదని బాధితులు వాపోతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పడు కూడా నిబంధనల పేరుతో సాయానికి కాలయాపన ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: