భూ వివాదం విషయంలో ఎస్సై తనను కొట్టాడంటూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కిన సంఘటన కలకలం రేపింది. ఉరవకొండ మండలానికి చెందిన గోపి అనే వ్యక్తికి ఐదు ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమిలో కొంత తనదంటూ మరో వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై ఉరవకొండ ఎస్సై ధరణిబాబు స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. అయితే తనను ఎస్సై అకారణంగా కొట్టాడంటూ ఇవాళ సాయంత్రం గోపి సెల్ టవర్ ఎక్కాడు.
గుంతకల్లు రోడ్డులో ఉన్న మైక్రోవేవ్ స్టేషన్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటాని బంధువులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన బంధువులు అక్కడికి చేరుకున్నారు. భూమి విషయంలో ఎస్సై అన్యాయం చేస్తున్నాడని.. తనకు భూమి దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో బంధువులు ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకుని బాధితునికి సెల్ ఫోన్ ద్వారా నచ్చజెప్పారు. అయినప్పటికీ గోపీ వినలేదు. చివరకు నీకు న్యాయం చేస్తామని గ్రామస్థుల సమక్షంలో చెప్పడంతో గోపి కిందకు దిగాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.