Flaxseed Gel for Hair : చాలామంది బరువు తగ్గాలని డైట్ పాటించేవారు అవిసె గింజల్ని ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇందులోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ వంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు స్కిన్, కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే కొలాజెన్ ఉత్పత్తికీ తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో జుట్టు, కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే ఈ అవిసె గింజల హెయిర్‌ప్యాక్ ఓసారి ప్రయత్నించండి.
కావాల్సిన పదార్థాలు :
- అవిసె గింజలు - ఒక కప్పు
- నీళ్లు - ఆరు కప్పులు
- కొబ్బరి నూనె - ఐదు టీస్పూన్లు
తయారీ విధానం :
ఒక కప్పు అవిసె గింజలకు 6 కప్పుల వాటర్ చేర్చి బాగా మరిగించాలి. వాటర్ సగానికి రాగానే స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఆ వాటర్ జెల్‌లా మారడం గమనించవచ్చు. ఇప్పుడు ఒక పల్చటి శుభ్రమైన వస్త్రం తీసుకొని, జెల్ నుంచి అవిసె గింజలను వడగట్టాలి. ఇలా వడగట్టిన జెల్‌కి 5 టీస్పూన్ల కొబ్బరి నూనెను యాడ్ చేసి బాగా కలపాలి.
ఎలా ఉపయోగించాలి?
హెయిర్ ప్యాక్ ట్రై చేసే ముందు జుట్టు శుభ్రంగా, పొడిగా ఉండాలి. జుట్టుని సన్నని పాయలుగా విడదీస్తూ, హెయిర్ ప్యాక్ కోసం రెడీ చేసుకున్న జెల్‌ని కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. నెమ్మదిగా మునివేళ్లతో ఒక 10 నిమిషాల పాటు కుదుళ్లను మసాజ్ చేసి, గంటపాటు ఆరనివ్వాలి. అనంతరం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరగడానికి తోడ్పడటమే కాకుండా హెయిర్ కండిషనర్‌గానూ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అవిసెగింజల ప్రయోజనాలు :
- హార్మోన్ల అసమతుల్యం కారణంగా మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ఇవి సమతుల్యం కావాలన్నా, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం కావాలన్నా అవిసెగింజలు తినాలని నిపుణులు పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
- అవిసెగింజల్లో ఉండే మ్యుసిలేజ్‌గమ్ జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలానే, ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. అలాగే బరువు అదుపులో ఉంచుతాయి.
- అవిసెగింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో తోడ్పడతాయి. అండాశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండెజబ్బులు, కీళ్లనొప్పులను రాకుండా కాపాడతాయి.
- అవిసెగింజల్లోని లిగ్నన్లు మెనోపాజ్ స్టేజ్‌కు చేరుకున్న మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో తోడ్పడతాయి. ఇవి ఈస్ట్రోజన్‌ని ఉత్పత్తి చేయగలగడంతో, నెలసరి సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!
మీ పట్టీలు నల్లగా మారాయా? - సింపుల్‌గా కొత్తవాటిలా మార్చుకోండి