అనంతపురం జిల్లా హిందూపురం పురపాలక సంఘం పరిధి కొల్లకుంట సమీపంలోని ఇందిరమ్మకాలనీలో స్వామి వివేకానంద మున్సిపల్ ప్రాథమిక పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. ఐదు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. స్థానికంగా పాఠశాల అవసరం ఉండటంతో పట్టణంలోని కంసలపేటలో విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలను 2019లో మున్సిపల్ పాలకవర్గం ఆమోదంతో ఇందిరమ్మకాలనీకి మార్చారు. అక్కడ ప్రభుత్వ భవనం లేనందున.. ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ప్రతినెల రూ.ఆరు వేలు చెల్లిస్తూ పాఠశాలను కొనసాగిస్తున్నారు.
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఐదు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో పాఠాలు చెప్పడం వారికి ఇబ్బందిగా మారింది. కాలనీలో పాఠశాల నిర్మాణానికి స్థానికులు 6 సెంట్ల స్థలాన్ని సమకూర్చారు. అనుమతి కోసం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించినా ఫలితం లేకపోయిందని ఉపాధ్యాయులు, స్థానికులు చెబుతున్నారు. తమ ఇబ్బందులను ఉపాధ్యాయ సంఘం నేతల ద్వారా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Agri Hubs: కొరవడిన ముందు చూపు..నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రాల హబ్‌లు