Chandrababu Fires on CM Jagan: జగన్ పాలనలో ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. కనీసం గ్రామాలకు తాగు నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి చేతకాని జగన్ అబద్దాలు మాత్రం అందరూ నమ్మేలా చెప్తారని అన్నారు.
పేదలకు సెంటు స్థలాలంటూ మభ్యపెడుతున్న జగన్.. టీడీపీ హయాంలో ఇచ్చినట్లు 3 సెంట్లు ఇవ్వగలరా అని.. చంద్రబాబు సవాల్ విసిరారు. అనకాపల్లికి రోడ్లు వేయించడం చేతకాని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దోపిడీ మాత్రం బాగా చేస్తున్నారని చురకలు అంటించారు. సంపదను సృష్టించి పేదలకు పంచడం తన నైజమని చంద్రబాబు అన్నారు.
"ఈరోజు రోడ్ షోలో అనకాపల్లి రోడ్డు చూశాను గతుకుల బొంత. ఒక రోడ్డు వేయని కోడిగుడ్డు మంత్రి.. పవన్ కల్యాణ్‌ని, నన్ను తిడుతుంటాడు. ఈయన విస్సన్నపేటలో 609 ఎకరాలు భూములు హాంఫట్ చేశాడు. కొండలు, గెడ్డలు కబ్జాలు చేస్తున్నాడు. ఇతన్ని ప్రజా కోర్టులో పెట్టాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడు పెట్టుబడిదారుల సదస్సులతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టించాం. 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. వీరు వచ్చాక కంపెనీలను తరిమేశారు. అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్టుకి ఐదేళ్ల క్రితం నేను శంకుస్థాపన చేశాను. నేనుండుంటే ఇప్పటికే విమానశ్రయం పూర్తయ్యేది. అప్పుడు వ్యతిరేకించిన జగన్ వారితో కమిషన్లు మాట్లాడుకుని ఇప్పుడు మళ్లీ శిలాఫలకం వేశాడు..సిగ్గుందా ఈయనకి" అంటూ నిలదీశారు.-చంద్రబాబు, టీడీపీ అధినేత
అనకాపల్లి సభకు జనం పోటెత్తడంపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు.. వైసీపీ దొంగల ముఠాతో జాగ్రత్తగా ఉండాలని.. సూచించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా బుద్ధి చెప్పాలని.. చంద్రబాబు పిలుపునిచ్చారు.
"నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా.. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలో ముందుచూపుతో పాలించాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్‌ది దొంగ చూపు.. బాబాయ్‌ని ఎవరు చంపారు?, గొడ్డలిపోటుని, గుండెపోటని చెప్పాడు. ఒక కన్ను ఇంకో కంటిని ఎందుకు పొడుచుకుంటాయన్నాడు. ఈరోజు దేశంలో న్యాయవాదులందరిని తెచ్చి బెయిల్ కోసం పాకులాడుతున్నారు. ఇదో పెద్ద థ్రిల్లింగ్ సస్పెన్స్ స్టోరీ"-చంద్రబాబు, టీడీపీ అధినేత
రెండు వెేల రూపాయల నోట్లు రద్దు చేయడం ప్రజలకు మేలు చేసే అంశం: కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. అవినీతి, ఓట్ల కొనుగోలుకు ఆస్కారం ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్లు గుర్తు చేశారు. తాజా నిర్ణయం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
- Rajanna Dora on Elections: రాష్ట్రంలో ఎన్నికలు అప్పుడే.. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి: ఉపముఖ్యమంత్రి
- Avinash Reddy mother health condition: అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే..
- BJP Executive Meeting వైసీపీ అవినీతిపై కొనసాగుతున్న బీజేపీ చార్జిషీట్లు.. పవన్‌తో పొత్తుపై అధిష్టానిదే నిర్ణయమన్న నేతలు