Train incident and woman Kidnapping case Accused arrest: అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ ఎక్కుతుండగా ముగ్గురు ప్రయాణికులు జారిపడ్డారు. ప్రయాణికులు జన్మభూమి రైలు ఎక్కుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి కాలు విరగ్గా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స మేరకు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. జన్మభూమి రైలు వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రైన్ ఎక్కుతున్న సమయంలో ప్రయాణికులు జారి పడ్డారు. ఇది గమనించిన సిబ్బంది రైలును ఆపడంతో ప్రాణాపాయం నుంచి ప్రయాణికులు తప్పించుకోగలిగారు.
కాగా.. రైలు ఎక్కుతున్న సమయంలో ఓ మహిళ జారిపడుతుండగా.. ఆమెను కాపాడేందుకు శంకర్రావు అనే మరో ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే ఆమెను కాపాడబోయిన అతడు కూడా జారిపడిపోయాడు. దీంతో అతడి కాలు విరిగిపోయింది. ఈ ప్రమాదంలో అన్నపూర్ణ అనే మరో ప్రయాణికురాలు కూడా రైలు ఎక్కుతుండగా జారిపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స మేరకు వారిని అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు పంపించారు.
అర్ధరాత్రి మహిళ కిడ్నాప్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్.. మరోవైపు నెల్లూరు జిల్లాలోని కందుకూరులో ఓ మహిళను అపహరించేందుకు ముగ్గురు దుండగులు ప్రయత్నించారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను.. ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేయబోయారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి.. వెంటనే దిశ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయానికి ఆ మహిళను ఆటోలో బలవంతంగా తీసుకెళ్తున్న దుండగులను సమీపంలోని పెట్రోల్ బంక్ సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు.
దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులలో ఇద్దరు వ్యక్తులు గూర్ఖాలుగా పని చేస్తుండగా.. మరొకరు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. ఈ సంఘటనలో బాధితురాలికి మాటలు రావు, చెవులు వినిపించవు. బాధితురాలు ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సు లేకపోయేసరికి.. నడుచుకుంటూ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. బాధితురాలిని సురక్షితంగా ఇంట్లో వదిలిపెట్టారు. కాగా.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ సంఘటనను గమనించి.. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించిన అజ్ఞాత వ్యక్తిని దిశ టీం అభినందించింది.