Irregularities in National Employment Guarantee Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాల పై జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలుసార్లు స్పందనలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు విచారణకు హాజరు కాకపోవడం అన్యాయమని పేర్కొంటున్నారు. ఈ గ్రామానికి చెందిన వివిధ గ్రూపుల పేరిట సుమారు వెయ్యి మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది జీడిపెక్కల ఫ్యాక్టరీల్లో విధులు నిర్వహిస్తుండగా మరికొందరు స్థానికేతరుల వద్ద వ్యాపారం చేసుకున్నటువంటి వారి పేర్లతో.. బినామీ పేర్లతోనూ మాస్టార్లు వేయించి గ్రామానికి చెందిన వీఆర్పీ నిధులు స్వాహా చేస్తున్నారని.. ఎందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని గ్రామ యువకులు మండిపడుతున్నారు. తనను గతంలో చేసిన ఫిర్యాదుల మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన విచారణకు వస్తున్నట్టు సమాచారం అందించగా గ్రామానికి చెందిన కూలీలంతా స్థానిక సచివాలయానికి హాజరయ్యారు. అయితే మండల స్థాయికి సిబ్బందిని విచారణకు హాజరు పంపడం పట్ల కూలీలు ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు వచ్చిన సిబ్బందిని తిరిగి పంపించేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ అక్రమాలపై బహిరంగ విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
మాది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట. మాకు ఉపాధి హామి పథకంలో అవినీతి జరుగుతుందని జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశాము. వారంలో పనిలోకి వెళ్లని వారికి 6 మాస్టార్లు పడుతున్నాయి, పనిలోకి వెళ్లిన వారికి 3 మాస్టార్లు పడుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశాము. స్పందనలో 6సార్లు ఫిర్యాది చేశాము. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 4 ఫిర్యాదులు ఇచ్చాం. దీనిపై కలెక్టర్ కార్యాలయం ఎంక్వైరికి వచ్చిన అధికారులు మేమడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా పారిపోవటం జరిగింది. వారు పారిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని అడిగితే ఉన్నతాధికారులు వచ్చి చర్చిస్తారని చెబుతున్నారు. ఈ సమస్యపై విచారణ జరిపి సరైన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీల్లోకి వెళ్లేవారికి 6 మాస్టార్లు పడుతున్నాయి, టిఫిన్ సెంటర్లో ఉండే వారికి 6 మాస్టార్లు పడుతున్నాయి. వీరంతా ఎవరూ పనిలోకి వెళ్లరు. పనిలోకి వెళ్లే వారికి వారానికి మాత్రం 3 మాస్టార్లు 2 మాస్టార్లు పడుతున్నాయి. ఇది ప్రశ్నించిన వారికి హాజరు వేయటంలేదు. - గ్రామస్తుడు