విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా కోసమంటూ.. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని 9 రెవెన్యూ గ్రామాల్లో.. సుమారు 3 వేల 800 ఎకరాలను అధికారులు సేకరించారు. ఇందులో 2 వేల 250 ఎకరాల వరకూ జిరాయతీ భూములున్నాయి. ఇందులో గత ప్రభుత్వ హయాంలో 90 శాతం వరకు చెల్లింపులు జరిగిపోయాయి. ఎకరాకు 18 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించారు. అయితే.. ప్రస్తుతం అమలాపురం పంచయతీలోని మూలపర్ర రైతుల నుంచి సేకరించిన భూముల పరిహారం పంపిణీలో కొన్ని అక్రమాలు బహిర్గతమయ్యాయి. మాజీ సర్పంచ్, అధికారులతో కలిసి... సాగులో లేని రైతుల పేరిట పరిహారం కాజేశారు. ఆ సొమ్ముల్ని వారి నుంచి తీసుకుని వాటాలు పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూలపర్ర ఉప సర్పంచ్‌తో పాటు కొందరు కలిసి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించగా... పరిహారం పక్కదారి పట్టిన విషయం వెలుగుచూసింది. తమకు దక్కాల్సిన సాయం సొమ్ము... అధికార పార్టీ నాయకులకు ఫలహారంగా మారిందని.. ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్‌తోపాటు.. రైతులు వాపోతున్నారు.
మూలపర్ర పరిధిలో సుమారు 300 ఎకరాలను సేకరించారు. ఈ గ్రామాన్ని ఆనుకుని విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు పదెకరాల భూమిని తీసుకున్నారు. ఇందులో అసలు రైతుల భూముల్ని తక్కువగా చూపి... ఆ పరిహారాన్ని మరికొందరి ఖాతాల్లోకి మళ్లించారు. ఇలా దాదాపు కోటి రూపాయలకు పైగానే పక్కదారి పట్టంచారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా వేలిముద్రలు తీసుకుని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకూ తమ భూముల్లోకి ఎవరినీ రానీయబోమని తెగేసి చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్య విన్నవించుకున్నా.. దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: