Attack on Dalit Youth in Anakapalli District: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మర్రివలసలో దళిత యువకుడు వారా కన్నయ్యపై.. గురువారం వైసీపీకి చెందిన నలుగురు యువకులు హత్యాయత్నం చేశారు. అమ్మిరెడ్డి వంశీ, జగన్నాథం, ఎలిశెట్టి వరహాలు, రాములు కలిసి.. కన్నయ్య తల్లి రమణమ్మ, తమ్ముడు చూస్తుండగానే అతణ్ని హతమార్చేందుకు యత్నించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వంశీ కత్తితో మెడపై నరికేందుకు యత్నించగా.. కన్నయ్య తప్పుకోవడంతో తల, మెడ, చేతులు, భుజం, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. కొత్తకోట ఎస్సై లక్ష్మణరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని.. కన్నయ్యను 108లో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమచికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు పంపారు.
నా చావుకి వారే కారణం - కలచివేస్తున్న దళిత యువకుడు మహేంద్ర వాంగ్మూలం
బాధితుల కథనం ప్రకారం.. మర్రివలస ఎస్సీ కాలనీకి ఎస్సీ కాలనీకి చెందిన కన్నయ్య.. తన సెల్‌ఫోన్‌ను దొంగిలించాడని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి వంశీ.. ఇటీవల గ్రామపెద్దల ఎదుట పంచాయితీ పెట్టారు. వంశీకి 10 వేలు ఇవ్వాలని పంచాయితీ పెద్దలు చెప్పగా.. కన్నయ్య 5 వేలు చెల్లించాడు. ‘మరో 10వేలు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తానని హెచ్చరిస్తూ వంశీ.. కులం పేరుతో కన్నయ్యను దూషించాడు.
‘సెల్‌ఫోన్ చోరీతో నాకు సంబంధం లేకున్నా.. గ్రామపెద్దలు చెప్పడంతో 5 వేలు ఇచ్చానన్న కన్నయ్య.. ఇక ఇచ్చేది లేదని ఏం చేసుకుంటావో చేసుకో అని తేల్చి చెప్పాడు. దీంతో కన్నయ్యపై కక్ష పెంచుకున్న వంశీ.. గురువారం రాత్రి భోజనం చేస్తుండగా కన్నయ్యను పంచాయితీ పెద్దలు పిలుస్తున్నారని అమ్మిరెడ్డి జగన్నాథం వచ్చి.. రామాలయం వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతడి వెంట తల్లి రమణమ్మ, తమ్ముడు నాగేశ్వరరావు కూడా వెళ్లారు.
భయపడిందే జరిగింది - దళిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ నేత వర్గీయుల దాడి
అయితే అప్పటికే వంశీ, వరహాలు, రాము రామాలయం వద్ద అక్కడ ఉన్నారు. నలుగురిలో ఇద్దరు రమణమ్మ, నాగేశ్వరరావును కదలకుండా పట్టుకున్న సమయంలో వంశీ కత్తితో కన్నయ్యపై దాడిచేశాడు. ఇంతలో రమణమ్మ ప్రతిఘటించి వంశీ చేతిలోని కత్తిని లాక్కుని అక్కడ నుంచి కాలనీలోకి పరుగు తీశారు. వంశీ, జగన్నాథం, వరహాలు, రాములు తన కుమారుడిపై కత్తితో దాడిచేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రమణమ్మ తెలిపారు.
జరిగిన దాడిలో కన్నయ్య తల, మెడ, భుజం, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కొత్తకోట ఎస్సై లక్ష్మణరావు ఘటనా స్థలికి చేరుకొని కన్నయ్యను 108లో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణరావు పేర్కొన్నారు. కన్నయ్య, అతడి సోదరుడు నాగేశ్వరరావు కర్రలతో తనపై దాడిచేశారని అమ్మిరెడ్డి వంశీ కంప్లైంట్ చేశారని ఎస్సై చెప్పారు. ఈ ఘటనపై అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దళిత యువకుడి ముఖంపై మూత్రం! ఘటనపై భగ్గుమన్న దళిత సంఘాలు, విపక్షాలు!