Lack of Facilities in Paderu Hospital: నవ మాసాలు మోసి ఎన్నో కలలు కన్న.. పేగు బంధం ఎన్నాళ్లో ఉండడం లేదు. రోజులు కూడా నిండని శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఆసుపత్రిలో వసతులు లేక, పెద్ద ఆసుపత్రిలో అంబులెన్స్ లేక.. విగత జీవులను వదల్లేక పుట్టెడు దుఃఖాన్ని కళ్లల్లో దిగమింగుకుంటూ.. ద్విచక్ర వాహనాలపై తీసుకొస్తున్న గిరిజన గాధలెన్నో చోటు చేసుకుంటున్నాయి. పేరుకే జిల్లా ఆసుపత్రులు.. అవి కూడా వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. చంటిపిల్లల వార్డుల శ్లాబులు కూలిపోయి ఆరు నెలలు అయినప్పటికీ పట్టించుకోలేని దుస్థితి. ఏమిటి మాకు ఈ దౌర్భాగ్యం అంటూ మృత శిశువులను పట్టుకుని బోరును వినిపిస్తున్న కథలెన్నో.. పాడేరు మాత శిశు ఆస్పత్రిలో నిత్యం జరుగుతున్నాయి.
కూలిపోయిన రూఫ్‌లు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో.. చంటి పిల్లల.. న్యూ బర్న్ యూనిట్ రూముల శ్లాబ్‌లు కూలిపోయి నిరుపయోగంగా మారాయి. సరిపడా వసతి సౌకర్యం లేక ఆరు నెలలుగా నవజాతి శిశువులతో బాలింతలు ఇక్కట్లు పడుతున్నారు. పుట్టిన వెంటనే బరువు తక్కువ, నెల తక్కువ ఇలా వివిధ కారణాలతో పుట్టిన పిల్లలకు.. సరైన వెచ్చదనం కోసం ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఇలాంటివి పాడేరు ఆసుపత్రిలో గతంలో 12 వరకు ఉండేవి. గత సంవత్సరం ఆగస్టులో ఒక గదిలో రూఫ్ కూలిపోయి.. పెచ్చులూడి శిథిలమైంది.
12కి 5 మాత్రమే: ఇక మరొక రూమ్‌లో కూడా ఇలాగే కూలిపోయి.. సీలింగు, ఏసీ, విద్యుత్ పరికరాలు వేలాడుతున్నాయి. ఇక్కడి వైద్యులు.. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ మరమ్మతులు చేయలేదు. దీంతో మొత్తం 12 యూనిట్లకు.. ఐదింటిని ఒకేచోట పెట్టారు. మరొక ఏడు నిరుపయోగంగా ఉన్నాయి.
అందరూ ఒకే దగ్గర: ఫిబ్రవరి రెండో తేదీన ప్రసవమైన.. ఓ శిశువు ఇప్పటికీ కోలుకోలేదు. నిత్యం శరీరాన్ని ఉష్ణోగ్రతలో ఉంచుతూ పర్యవేక్షిస్తున్నారు. అందరికీ సరిపడా యూనిట్లు అందుబాటులో లేకపోవడంతో ఒక శిశువు తర్వాత మరొక శిశువుని పెడుతున్నారు. చాలామందికి.. ఒకే దగ్గర ఇలా చేయడం ఒకరి లోపం.. మరొకరికి వచ్చే అవకాశం ఉందని శిశు బంధువులు చెప్తుతున్నారు.
శిశువు మృతి: వసతులు లేక.. పాడేరులో జన్మించిన ఓ శిశువును మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా.. ఆ చిన్నారి మృతి చెందింది. అలాగే జి మాడుగుల నుంచి వచ్చిన ఓ దంపతులు.. మృత శిశువును పట్టుకుని వేచి చూస్తున్నారు. అంబులెన్స్ లేక ప్రైవేటు వాహనంలో ఎక్కించేందుకు చేతిలో డబ్బులు లేక.. ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. మృత శిశువులకు అంబులెన్స్‌లు ఇవ్వడం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
గిరిజనులకు అందని వైద్యం: పేరుకే వైద్యం అందిస్తున్నారు తప్ప.. పూర్తి స్థాయిలో పాడేరు ఆస్పత్రిలో వైద్య సేవలు లేవు. వైద్య పరికరాలు, మందులు, సదుపాయాలు లేక.. ప్రతి చిన్న అనారోగ్య సమస్యలకు శిశువులను కేజేహెచ్కు రిఫర్ చేస్తున్నారు. అందీ అందని వైద్య సేవలతో శిశువులు మృత్యువాత పడుతున్నారు. అక్కడ గిరిజన సెల్ ఉన్నప్పటికీ అది పెద్ద పెద్ద సిఫార్సులకే పరిమితం అవుతుంది. గిరిజనులకు మాత్రం వైద్యం అందని పరిస్థితి.
ఇప్పటికైనా స్పందించండి సారూ: ఏ వైద్య సదుపాయం కావాలన్నా అధికారులకి వెంటనే తెలియజేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. గతంలో నిరుపయోగమైన శిశు సంరక్షణ గదిని మరమ్మతులు చేయాలని అధికారులకు చెప్పామని అంటున్నారు. కానీ ఆ మరమ్మతులు నేటికీ పూర్తికాలేదు. పేరుకే జిల్లా ఆసుపత్రిగా ఉన్న పాడేరు ఆసుపత్రిని పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుని తమ చిన్నారుల ప్రాణాలను కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ గోడు ఆలకించి.. మరమ్మతులు చేయాలని వేడుకుంటున్నారు.
"మేము ఇక్కడికి వచ్చి రెండు వారాలు అవుతోంది. మా బేబీ తక్కువ బరువుతో పుట్టింది. కంగారూ పద్దతిలో పెట్టాలని అన్నారు. కానీ రూమ్‌లో మొత్తం సీలింగ్ పడిపోవడం వలన.. బయట బెడ్లో ఉంటున్నాము. అలాగో వెంటిలేటర్లు కూడా పనిచేయకపోవడం వలన ఇబ్బందవుతోంది". - శిశువు తండ్రి
"జిల్లా ఆసుపత్రిగా పేరొందిన ఇక్కడికి.. చిన్నారులను, అదేవిధంగా ప్రెగ్నెన్సీలకు ఇక్కడికే తీసుకొస్తారు. కానీ రూఫ్‌లు పడిపోయి చాలా నెలలు అవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నో కలలుతో కన్న పిల్లలు మరిణిస్తున్నా.. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం లేదు". - మణి కుమారి, మాజీమంత్రి
"ప్రస్తుతం కేవలం 5 వార్మర్ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అయిదు మాత్రమే ఉండటం వలన ఏదైనా అత్యవసరం అయితే సర్దుబాటు చేయడం ఇబ్బందికరంగా మారింది". - డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్
ఇవీ చదవండి: