High Court passed interim order: తనపై నమోదైన రెండు కేసులు కొట్టేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ రెండు కేసుల్లో 41 ఏ సీఆర్పీసీ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది . ఉద్దేశ్యపూర్వకంగానే ఎంపీపై కేసు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రిట్ పిటిషన్ వేసి అడిగినపుడు మాత్రమే ఈరెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారని న్యాయవాది వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ప్రతీకారంతోనే రఘురామపై కేసు నమోదు చేశారని ధర్మాసనానికి తెలిపారు. రఘురామకృష్ణరాజుపై నమోదైన 11 కేసుల్లో 10 కేసులు పశ్చిమగోదావరి జిల్లాలోనే నమోదు చేశారని న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. 41 ఏ సీఆర్పీసీ నిబంధనలు పాటించాలని పోలీసులను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
భూపతి వెంకటశ్రీనివాసరాజు ఫిర్యాదు: రఘురామకృష్ణ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొంటూ భూపతి వెంకటశ్రీనివాసరాజు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పోలీసులు ఎంపీ రఘురామపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామ ప్రోద్బలంతో ఆయన మద్ధతుదారులు ర్యాలీలు చేస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు భగ్నం చేస్తున్నారని.. మరోవైపు ఇదే వ్యవహారంపై కె. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాళ్ల ఠాణాలో ఎంపీ రఘురామపై గతేడాది కేసు నమోదు చేశారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్: తనపై నమోదైన కేసును కొట్టివేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్లో నమోదైన కేసులో ఫిబ్రవరిలో తన పేరును చేర్చడంపై శ్రీధర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. జిల్లా ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను వాయిదా వేసింది.
ఇవీ చదవండి: