Ganja Transportation with Theft Bikes : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్రవాహనాల చోరీల కేసులను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితులు ఇతర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు చోరీ చేసి, వాటిని మన్యానికి తీసుకొచ్చి గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం జి.మాడుగులలో వెల్లడించారు.
గత సంవత్సరం ఏప్రిల్లో నెల్లూరు, గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎస్కే బాజ్జీ, బత్తుల సాయికిరణ్లు.. తాము దొంగిలించిన ద్విచక్ర వాహనాలను ఏజెన్సీ ప్రాంతానికి తీసుకొచ్చారు. చింతపల్లి మండలం అన్నవరం ప్రాంతానికి చెందిన తాంబెలి శివ, జి.మాడుగుల మండలం చిన్నబంద వీధికి చెందిన చంటి నుంచి గంజాయి తీసుకొని బదులుగా ద్వి చక్రవాహనాలు ఇచ్చేవారు. అప్పట్లో చంటిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న తాంబెలి శివ ఆలియాస్ వంశీని ముందస్తు సమాచారంతో జి.మాడుగుల తహసీల్దారు కార్యాలయ కూడలిలో బుధవారం మాటు వేసి పట్టుకున్నారు.
అతడిని విచారించగా.. కొత్తపల్లి జలపాతం వద్ద నెల్లూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన ఎస్కె బాజ్జీ, బత్తుల సాయికిరణ్కు గంజాయిని విక్రయించి, డబ్బులకు బదులుగా వారు చోరీ చేసిన ద్విచక్రవాహనాలను తీసుకున్నట్లు అంగీకరించాడు. వాటికి సరైన రికార్డులు లేకపోవడంతో అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొండల్లో వాటిని దాచిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. వీటన్నంటిని ఒకేసారి ఒడిశాలోని సిమిలిగూడలో స్క్రాప్ దుకాణానికి తీసుకెళ్లామని, అనంతరం వాటిని దాచిపెట్టినట్లు చెప్పాడు.
జి.మాడుగుల పోలీసులు అన్నవరం కొండ ప్రాంతాల్లో దాచిపెట్టిన 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 10 బైక్లు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందినవిగా గుర్తించారు. ద్విచక్రవాహనాలను సీజ్ చేసి.. శివను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ మత్స్య రాజు, హెచ్సీలు అప్పలరాజు, అప్పారావు, పీసీలు కిశోర్, సత్యారావు, ఉదయ్, చిన్నబాబు, అప్పలరాజులను ఎస్పీ అభినందించారు.
ప్రత్యామ్నాయ పంటలు పండించాలి : గిరిజనులు గంజాయి సాగును శాశ్వతంగా వదిలి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపునిచ్చారు. నుర్మతిలో కిల్లంకోట, బొయితిలి, భీరం, నుర్మతి పంచాయ తీల రైతులకు పరివర్తన కార్యక్రమంలో భాగంగా బుధవారం 22 రకాల పండ్ల మొక్కలను ఎస్పీ పంపిణీ చేశారు. గిరిజనులు మావోయిస్టులకు సహకరించవద్దన్నారు. జిల్లా వ్యవసాయాధికారి నంద్, ఉద్యానశాఖ పీడీ రమేష్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ రంగారావు, సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాసరావు, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ఉదయ్. పోలీసు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
"గంజాయి రవాణా, బైక్లు దొంగతనం చేస్తోన్న నలుగురిని అరెస్టు చేశాం. వారి నుంచి 12 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది."- తుహీన్ సిన్హా , అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ