Shortage of Teachers: అడవిలో కొద్దోగొప్పో భూమిని సాగు చేసుకుంటూ అరకొర సంపాదనతో నెట్టుకొస్తున్న గిరిజనులు భవిష్యత్ ఉంటుందని తమ పిల్లలను చదివించుకుందామంటే ఉపాధ్యాయుల సమస్యతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేసి స్థిరపడుతారనుకుంటే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారైంది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దుప్పులవాడ ఎంపీపీ పాఠశాలలోనూ విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను బదిలీ చేసి ఇతరులను భర్తీ చేయడాన్ని మరిచారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడానికి బదులు వ్యతిరేక దిశలో విద్యాశాఖ ఉదాసీనంగా ప్రవర్తించడం అటు విద్యార్థుల్లో చదువుపై నిరాసక్తి, ఇటు తల్లిదండ్రుల్లో అసహనం పెరుగుతోంది.
ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన..: టీచర్లను నియమించకపోతే ఆందోళన చేయకతప్పదని, పాఠశాలకు తాళాలు వేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిక చేశారు. దుప్పులవాడ పాఠశాలలో 138 మంది పిల్లలకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉంటే పిల్లలకు చదువులు ఎలా వస్తాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడూ రాకపోవడంతో నిరసనకు దిగారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దుప్పులవాడ ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలంటూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు.
పాఠశాలకు తాళాలు వేస్తాం..: ఉపాధ్యాయుడ్ని నియమించకుంటే పాఠశాలకు తాళాలు వేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు. భారీ ఎత్తున ఆందోళన చేయడంతో మండల విద్యాశాఖాధికారి హుటాహుటినా వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అయిదు రోజుల్లో పరిస్థితి మారకుంటే పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తామని విద్యార్థులు తల్లిదండ్రులు హెచ్చరించారు. గూడెం కొత్తవీధి మండలంలోని దుప్పులవాడ ఎంపీపీ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 138 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆయన కూడా విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
విద్యాకమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో ఆందోళన..: సర్పంచ్ కెలేబు కుమారి, మాజీ ఎంపీటీసి, పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారన్న విషయం తెలియడంతో జీకేవీధి ఎంఈవో చంద్రశేఖర్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడారు. గతంలో ఈ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఉండేవారని ఇద్దరిని సీలేరు, ఒకరిని రుష్యాగూడకు డిప్యుటేషన్‌పై పంపించారన్నారు. ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడితోనే విద్యాబోధన సాగుతోందన్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో విద్యార్థులు రోడ్డుపై తిరుగుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను మళ్లీ వెనక్కి తీసుకొస్తామని ఎంఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఖాళీ స్థానాల్లోనూ భర్తీచేయాలి..: గ్రామస్థులకు తెలపడంతో వారు ఆందోళన విరమించారు. రుష్యాగూడ నుంచీ ఉపాధ్యాయురాలిని దుప్పులవాడ ఎంపీపీ పాఠశాలకు రప్పించడంతో విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. కానీ బదిలీపై వెళ్లిన ముగ్గురు ఉపాధ్యాయులను సైతం రప్పించి అన్నీ తరగతులలోనూ పాఠ్యాంశాలను బోధించేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి