రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ విజేత 'లక్ష్య ఇనిస్టిట్యూట్'(Lakshya Institute News) శుక్రవారం ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'వన్ డ్రీమ్, వన్ లక్ష్య'(One Dream-One Lakshya Initiative) కార్యక్రమంతో ఏడుగురు అథ్లెట్లను ఒలింపిక్స్ కోసం సిద్ధం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అథ్లెట్లను ఐదు భిన్నమైన ఆటల్లో తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది లక్ష్య.
డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్(Dream Sports Foundation) సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లక్ష్య ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఈ మేరకు అథ్లెట్లకు ఆర్థిక సాయం, మెరుగైన శిక్షణ, ట్రైనింగ్ ఎక్విప్మెంట్, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది.
మహారాష్ట్ర టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ సుందర్ అయ్యర్, డ్రీమ్ స్పోర్ట్స్ హెడ్, చీఫ్ పాలసీ ఆఫీసర్ కిరణ్ వివేకానంద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది లక్ష్య ఇనిస్టిట్యూట్. 2024 పారిస్ ఒలింపిక్స్, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టన్నిస్ విభాగాల్లో అథ్లెట్లను ప్రోత్సహించనుంది.
"ఈ భవిష్యత్ లక్ష్యంతో మరికొంత మంది భారత అథ్లెట్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచి 2024, 2028 ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరికొంత మంది అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం."
-స్వస్తిక్ సిర్సికర్, లక్ష్య ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు.
ఇటీవలే డీఎస్ఎఫ్.. మేరీకోమ్ రీజినల్ బాక్సింగ్ ఫౌండేషన్(Mary Kom Regional Boxing Foundation), బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్‌తో భాగస్వామ్యం అయింది. యువ అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 సమయంలో దాదాపు స్పోర్ట్స్ విభాగానికి చెందిన 3500 మందికి సాయం చేసింది. 'బ్యాక్ ఆన్ ట్రాక్' చొరవతో ఈ సాయం అందించినట్లు పేర్కొంది.