కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ రద్దయినప్పటికీ క్రీడాకారులకు నగదు బహుమతి ఇవ్వాలని టోర్నీ నిర్వాహకులు నిర్ణయించారు. టోర్నీ జరిగితే ప్రధాన డ్రాలో ఆడి ఉండే 256 మంది క్రీడాకారులకు ఒక్కొక్కరికి 31 వేల డాలర్లు, అర్హత పోటీల్లో తలపడి ఉండే 224 మందికి ఒక్కొక్కరికి 15600 డాలర్లు అందనున్నాయి. డబుల్స్ క్రీడాకారులకు తలో 7800 డాలర్లు ఇస్తారు.
"టోర్నీ రద్దయిన వెంటనే ఆటగాళ్లకు సహాయం చేయడం ఎలా అన్నదాని గురించి ఆలోచించాం' అని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి రిచర్డ్ లూయిస్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 29న వింబుల్డన్ ఆరంభం కావాల్సింది. కరోనా కారణంగా రద్దు చేయక తప్పలేదు. 1945 తర్వాత ఈ టోర్నీ రద్దు కావడం ఇదే తొలిసారి.