గత మూడు రోజులుగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ నిరసనలు చేస్తున్న రెజ్లర్లు ఎట్టకేలకు శాంతించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వారి మీ టూ ఉద్యమాన్ని విరమించారు. తమ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా దిగి వచ్చి ఈ సమస్యలపై వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియాతో పాటు మరికొంతమంది రెజ్లర్లతో రెండో దఫా చర్చలు జరిపారు. దీనిలో భాగంగా బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పిస్తున్నట్లు ఠాకూర్ చెప్పారు. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఐఓఏ కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రెజ్లర్లు తమ నిరసనలను విరమించారు.
"ఇందుకోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తాం. అది నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుంది. కమిటీ సభ్యుల పేర్లు రేపు ప్రకటిస్తాం. కమిటీ విచారణ పూర్తయ్యేవరకు బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాడు" అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. దీంతో డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌భూషణ్‌ను తొలగించటమే కాక, ఆయనపై పలువురు కేసు పెడతామని చెప్పిన రెజ్లర్లు శాంతించి తమ ఆందోళనలను విరమించుకున్నారు.
కాగా, గురువారం కేంద్ర క్రీడల మంత్రితో రెజ్లర్ల సమావేశం నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌ను 24 గంటల్లోపు రాజీనామా చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయనే వార్తలు వెలువడ్డాయి. అతడిని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా తప్పించాలని రెజ్లర్లు మూడు రోజులుగా ఉద్యమం చేస్తున్నప్పటికీ.. అతను మాత్రం ఆ పదవి వదిలేదే లేదని స్పష్టం చేశాడు. తనపై వస్తున్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. తాను ఎలాంటి విచారణను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఏ తప్పూ చేయనప్పుడు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ కుట్ర వివరాలన్నీ బయటపెడతానని వెల్లడించారు. విచారణ జరిగేంతవరకు అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాను. కానీ రాజీనామా చేసేదే లేదు అని స్పష్టం చేశారు. అయితే సమయం దాటినా ఆయన మీడియా ముందుకు రాలేదు. అయితే, మీడియా ముందుకు రావొద్దంటూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సూచన మేరకు మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.