National Games Telugu Athelets: జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారుల చక్కటి ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం తెలంగాణ మూడు స్వర్ణాలు, ఒక రజతం, మరో కాంస్యం సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రెండు రజతాలు, మూడు కాంస్యాలు దక్కాయి. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 3-0తో కేరళపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి- సిక్కిరెడ్డి జోడీ 21-15, 14-21, 21-14తో అర్జున్- ట్రీసా జాలీ జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 18-21, 21-16, 22-20తో హెచ్.ఎస్.ప్రణయ్‌పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో సామియా ఇమాద్ ఫారూఖీ 21-5, 21-12తో గౌరీకృష్ణపై గెలిచి తెలంగాణ జట్టుకు విజయాన్ని అందించింది.
మహిళల ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్‌లో తెలంగాణ అమ్మాయి రియా సాబూ స్వర్ణంతో మెరిసింది. 112.4 పాయింట్లతో రియా ప్రథమ స్థానం సాధించింది. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు కుల సాయి సంహిత (107) రజతం, భూపతిరాజు అన్మిష (97.8) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. స్విమ్మింగ్‌లో వ్రితి అగర్వాల్ రజతం సాధించింది. 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో వ్రితి (9 నిమిషాల 23.91 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో తెలంగాణ పురుషుల జట్టు కాంస్యం సాధించింది. 8 ప్లస్ కాక్స్‌విన్‌లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజు, చరణ్‌సింగ్, మహేశ్వర్‌రెడ్డి, గజేంద్రయాదవ్, నవదీప్, హర్‌ప్రీత్‌సింగ్, శ్రీకాంత్ (కాక్స్)లతో కూడిన తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.





మహిళల 3×3 బాస్కెట్‌బాల్‌లో తెలంగాణ జట్టు బంగారు పతకం దక్కించుకుంది. ఫైనల్లో తెలంగాణ 17-13తో కేరళపై విజయం సాధించింది. పుష్ప, అశ్వతి థంపి, అంబరాశి సత్తాచాటారు. జిమ్నాస్టిక్స్ మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షేక్ యాసిన్ ద్వితీయ స్థానంలో నిలిచి రజతం సాధించింది. మహిళల హెప్టాథ్లాన్‌లో ఎం.సౌమియా, వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగం 87 కేజీల విభాగంలో టి.సత్యజ్యోతి కాంస్యాలు అందుకున్నారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ సెమీస్‌లో చరణ్య, సూర్య హంసిని, షణ్ముఖి నాగసాయి, రూప చంద్రహాసినిలతో కూడిన రాష్ట్ర బృందం 228-225తో దిల్లీ జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించడం ద్వారా పతకం ఖాయం చేసుకుంది.
