దశలవారిగా త్వరలోనే క్రీడాకారులు తిరిగి సాధన మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం పలువురు అథ్లెట్లతో పాటు హాకీ క్రీడాకారులతో మాట్లాడతానని చెప్పారు. అథ్లెట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు తిరిగి ట్రైనింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకోసం తమను సంప్రదిస్తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) కేంద్రాల్లో ఉన్న అథ్లెట్లు శిక్షణ కోసం అభ్యర్థిస్తున్నారని వివరించారు.
ఇప్పటికే దేశంలో 60 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యియి. అందులో 2 వేల మందికిపైగా మృతిచెందారు. తాజాగా మూడోసారి లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. దీంతో క్రీడాకారులు కూడా తమ ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి అనుమతులు కోరుతున్నారని మంత్రి స్పష్టంచేశారు.
"క్రీడలొక్కటే కాదు ప్రజల జీవన విధానం కూడా మారింది. ఇకపై ఇదివరుకటిలా మనం జీవించలేం. ఇక నుంచి కొత్త పద్ధతులను అవలంభించాలి. అలాగే ఆటలు కూడా కొత్త మార్గంలో సాగుతాయి. క్రీడాభిమానులు లేకుండానే ఆటలను నూతన విధానాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలి. భవిష్యత్‌లో ఖాళీ స్టేడియాల్లోనే ఆడాల్సి రావొచ్చు. ఐపీఎల్‌కు మంచి ఆదాయం ఉంటుంది. కానీ, కొన్ని క్రీడలకు ఆ అవకాశం లేదు. వాటికి ఆర్థికసాయం అవసరం. అలాంటి క్రీడలకు, ఆయా సమాఖ్యలకు మేం చేయూతనిచ్చి ఆదుకుంటాం. మాకు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. పతకాల జాబితాలో భారత్ టాప్ టెన్‌లోకి రావాలి" అని రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు.