తన మనసెంతో ఆనందంగా ఉందని మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అన్నాడు. రాయ్ జోన్స్ జూనియర్‌తో త్వరలోనే ఓ ఛారిటీ మ్యాచ్‌లో తలపడనున్న నేపథ్యంలో టైసన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 28న లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న ఈ పోటీకి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరువురూ తగువులాడారు. బాక్సింగ్ పోటీల్లో గెలవడం నుంచి డ్రగ్స్ తీసుకోవడం వరకు అన్నిటి గురించి ప్రస్తావించారు.
హోరాహోరీగా..
ఇరువురు బాక్సర్లూ 50 ఏళ్లకు మించిన వారే. అయినా, కాలిఫోర్నియా రాష్ట్ర అథ్లెటిక్ కమిషన్ ఇచ్చిన హెడ్‌గార్డ్స్ పెట్టుకోకుండా పోటీపడనున్నట్లు పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో విజేత అయిన వారికి 'ఫ్రంట్‌లైన్ బ్యాటిల్ బెల్ట్' ఇవ్వనుంది డబ్ల్యూబీసీ.
రికార్డుల్లో ఇరువురూ ఇలా..
రాయ్ జోన్స్ జూనియర్(51) దిగ్గజ బాక్సర్‌గా పేరొందాడు. 1989 నుంచి 2018 వరకు.. మిడిల్ వెయిట్, సూపర్ మిడిల్ వెయిట్, లైట్ హెవీ వెయిట్, హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు.
'బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్'గా పేరు సంపాదించాడు దిగ్గజ బాక్సర్ టైసన్. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కానీ, 1990లో బస్టర్ డౌగ్లాస్తో ఓటమి తర్వాత టైసన్ కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత టైసన్‌పై రేప్, డ్రగ్స్ ఆరోపణలు కూడా వచ్చాయి. 2005లో తన చివరి మ్యాచ్ ఆడాడు.