షూటింగ్ క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత అథ్లెట్ మను భాకర్ 16 ఏళ్ల ప్రాయం నుంచే అదరగొడుతోంది. 2018 యూత్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన టీనేజ్ సెన్సేషన్ భారత నంబర్ వన్ షూటర్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి ప్రతీ టోర్నీలో పతకాల వేట సాగిస్తోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మను ప్రస్తుతం ఇంట్లోనే సాధన చేస్తోంది. ఈ సందర్భంగా తన ఇంటి ఆవరణలో ప్రాక్టీస్ చేస్తుంటే కొన్నిసార్లు కోతుల బెడద ఉంటోందని తాజాగా వెల్లడించింది.
ఈ లాక్‌డౌన్‌తో తన ట్రెయినింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అడగ్గా.. తాను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పింది. తన ఇంటి ఆవరణలోనే ప్రాక్టీస్ చేసేందుకు అనువైన ఏర్పాట్లున్నాయని, అయితే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయని తెలిపింది. తనకున్న మాన్యువల్ మెషిన్ తరచూ మరమ్మతులకు గురౌతుందని, అలాగే తమ ప్రాంతంలో కోతులు ఉండటం వల్ల వాటితో ప్రాక్టీస్‌కు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. ఇక లాక్‌డౌన్‌తో జరిగిన ఒక మంచి విషయం ఏంటని అడిగితే.. దీనివల్ల గాలి నాణ్యత పెరిగిందని చెప్పింది. ప్రజలకు కూడా తమ కుటుంబసభ్యులతో కలిసుండే అవకాశం కలిగిందని వివరించింది.