పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతో బంధం తెంచుకుంటున్నట్లు మాంచెస్టర్ యునైటెడ్ ప్రకటించింది. ఫిఫా ప్రపంచకప్ 2022లో భాగంగా మరో రెండు రోజుల్లో రొనాల్డో తన తొలి మ్యాచ్‌ను ఆడే క్రమంలో ఇలాంటి ప్రకటన రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత 2021లో మాంచెస్టర్ క్లబ్‌లోకి పునఃప్రవేశం చేసిన రొనాల్డో కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఆడాడు.
గతవారం ఓ టాక్ షోలో రొనాల్డో మాట్లాడుతూ.. "క్లబ్ నాకు ద్రోహం చేసింది. అలాగే మేనేజర్ ఇరిక్ టెన్ హ్యాగ్ పట్ల నాకు గౌరవం లేదు. క్లబ్ యాజమాన్యం ఫలితాలను చూడకుండా కేవలం ధనార్జనే లక్ష్యంగా ఉంది" అని వ్యాఖ్యానించాడు. దీంతో మాంచెస్టర్ క్లబ్ ఏకంగా రొనాల్డోను తొలగించినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. అలాగే మాజీ సహచరులు గ్యారీ నెవిల్లె, వ్యాన్ రూనీపైనా రొనాల్డో విరుచుకుపడ్డాడు. రొనాల్డోపై వారు విమర్శలు చేయడంతో "వీరిద్దరూ నా స్నేహితులే కాదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా రొనాల్డో వ్యాఖ్యలు, మాంచెస్టర్ తొలగించడంపై వ్యాన్ రూనీ స్పందించాడు. "నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. రొనాల్డో ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాడు. అయితే అతడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం. అలాగే రొనాల్డోను మాంచెస్టర్ తప్పించడంపై క్లబ్ అభిమానిగా, సహచరుడిగా బాధపడుతున్నా. అయితే పియర్స్ మోర్గాన్‌తో రొనాల్డో ఇంటర్వ్యూను చూస్తే.. అతడు క్లబ్‌పై ఎలా దాడి చేశాడో అర్థమవుతుంది. దీంతో అతడిని తప్పించడం మినహా మరో అవకాశం లేకుండా పోయింది. మాంచెస్టర్‌కు సేవకుడిగా ఉన్న రొనాల్డో ఇలా మాట్లాడం సిగ్గుచేటు. ఇప్పటికీ రొనాల్డో మంచి ప్లేయరే కానీ.. 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆడినట్లు మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు రొనాల్డోకి 37 ఏళ్లు. మాంచెస్టర్ తరఫున పూర్తిస్థాయిలో కాకపోయినా సబ్‌స్టిట్యూట్‌గా ఆడేందుకైనా అవకాశం ఉంటుందేమోనని భావించా. అయితే అతడు ఇలాంటి పాత్ర పోషించడానికి సుముఖంగా లేడు. తన కెరీర్‌ను కొనసాగించడానికే మొగ్గు చూపుతాడు. ప్రస్తుతం క్రిస్టియానో రొనాల్డో దృష్టంతా ప్రపంచకప్‌తోపాటు పోర్చుగల్ టీమ్‌పైనే ఉంది" అని రూనీ తెలిపాడు.
పోర్చుగల్ సీనియర్ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో అదే ఏడాది క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఆడాడు. ఆ తర్వాత రియల్ మాడ్రిడ్, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదీ చూడండి: యువరాజ్‌కు షాక్.. అనుమతి లేకుండా ఆ పని చేసినందుకు నోటీసులు