ఫిడే ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్లో భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇంటర్నెట్ సరఫరాకు అంతరాయం కలగడం వల్లే తమ జట్టులో ఒక ఆటగాడు ఓడిపోయినట్లు ఆరోపిస్తూ క్వార్టర్స్ సమరం నుంచి ఆర్మేనియా తప్పుకోవడం వల్ల ఆ సమయానికి 3.5-2.5తో ఆధిక్యంలో ఉన్న భారత్ ముందంజ వేసింది.
తొలి రౌండ్ మొదటి గేమ్‌లో లెవొన్ ఆరోనియన్‌తో విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకోగా.. గాబ్రియల్‌పై విదిత్ గుజరాతి నెగ్గాడు. మూడో గేమ్‌లో ఎలీనా చేతిలో కోనేరు హంపి ఓడగా, లిలిత్‌పై ద్రోణవల్లి హారిక గెలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత గేమ్‌లో హయక్‌పై నిహాల్ సరీన్ నెగ్గడం వల్ల భారత్ 3.5-1.5తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
అనాతో చివరి గేమ్‌లో వంతిక అగర్వాల్ ఓడినా భారత్‌దే పైచేయి అయింది. ఈ రౌండ్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఆరోపిస్తూ ఆర్మేనియా ఆందోళనకు దిగింది. కానీ వారి అప్పీల్‌ను నిర్వాహకులు తిరస్కరించడం వల్ల ఆ జట్టు పోటీ నుంచి తప్పుకుంది.