భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధూ.. తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఫుల్ ఫిట్‌గా ఉన్నట్లు చెప్పింది. కానీ ఫామ్‌లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్.. మంగళవారం దుబాయ్‌లో ప్రారంభమైన ఆసియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్స్‌లో పాల్గోంది. ఈ టోర్నమెంట్లో సింధుతో పాటు, స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ భారత్‌కు కీలకం కానున్నారు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19వరకు కొనసాగనుంది.
"నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. శారీరకంగా, మానసికంగా ఫుల్ ఫిట్‌గా ఉన్నా. గాయాలు అయ్యాయి.. కానీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ.. ప్రతిసారి మళ్లీ బలంగా తిరిగి రావడం చాలా ముఖ్యం. నేను చాలా కాన్ఫిడెంట్‌గా, సానుకూలంగా.. నా పొరపాట్ల నుంచి నేర్చుకుంటున్నా. నేను కోల్పోయిన ఫామ్‌ను కూడా తిరిగి పొందాలనుకుంటున్నాను. అయితే దానికోసం నేను పూర్తి కోలుకోవాలి. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను. కానీ.. మునుపటి ఫామ్‌తో ఆడటానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. నా తల్లిదండ్రులు కూడా అథ్లెట్లే. అందుకే నేను గాయంతో బాధపడుతున్నప్పుడు వారు నాకు బాసటగా నిలిచారు. నాలో ప్రేరణ కలిగించారు."
--పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్
గతేడాది పవీ సింధు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ టైటిళ్లను సాధించింది. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఈ గేమ్స్‌లోనే తన కాలికి గాయం అయింది. దీంతో ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్లకు దూరమైంది. అనంతరం జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌తో చాలా రోజుల తర్వాత ఆడింది. ఈ టోర్నీలో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయి.. తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అదే నెలలో జరిగిన ఇండియా ఓపెన్‌లో కూడా మొదటి రౌండ్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి బయటకు వచ్చింది. ఈ ఓటముల కారణంగానే.. పూర్తిగా కోలుకోడానికి ఆ తర్వాత జరిగిన ఇండినేసియా, థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నీలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్లేయర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది.
ఆసియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్స్, ఇండియా స్వ్కాడ్ :
- పురుషుల సింగిల్స్ : లక్ష్యా సేన్, హెచ్ఎస్ ప్రణయ్
- మహిళల సింగిల్స్ : పీవీ సింధు, ఆకర్షి కశ్యప్
- పురుషుల డబుల్స్ : సాత్విక్ సాయిరాజ్ రానిక్రెడ్డి/ చిరాగ్ శెట్టి, కృష్ణ ప్రసాద్ గార్గా/ విష్ణు వర్ధన్ గౌడ్ పి
- మహిళల డబుల్స్ : త్రీసా జాలీ/ గాయత్రి గోపీచంద్, అశ్విణి భట్/ శిఖా గౌతమ్
- మిక్స్డ్ డబుల్స్ : ఇషాన్ భట్నాగర్/ తనీషా క్రాస్టో