Cristiano Ronaldo: కెరీర్‌లో కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలన్న ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కల చెదిరింది. మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో ఓటిమితో పోర్చుగల్ ఇంటికి పయనమైంది. 37 ఏళ్ల రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్లే. ఈ మ్యాచ్‌లో ఓటమి ఖాయం కాగానే.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన రొనాల్డో మైదానంలో చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. అతడు కన్నీళ్లను తుడుచుకొంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా పేరున్న రొనాల్డో కెరీర్‌లో వరల్డ్‌కప్ ఓ లోటుగానే మిగిలి ఉంటుంది. పోర్చుగల్ తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్ చేశాడు.
పొర్చుగల్ నాకౌట్ రౌండ్ మ్యాచ్‌ల్లో రొనాల్డోను జట్టు మేనేజర్ ఫెర్నాండో శాంటోస్ బెంచ్‌కే పరిమితం చేశాడు. కేవలం సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగానే మైదానంలోకి దింపడం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ 50 నిమిషాలు గడిచిన తర్వాత మైదానంలోకి దిగిన రొనాల్డో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రొనాల్డోను రిజర్వు బెంచ్‌కు పరిమితం చేయడాన్ని శాంటోస్ సమర్థించుకొన్నాడు.
"నేను ఏమీ బాధపడటంలేదు. నేను ఏమీ మార్చలేను. స్విట్జర్లాండ్‌పై అద్భుతంగా ఆడిన జట్టునే బరిలోకి దింపాను. దానిని మార్చడానికి కారణం లేదు. రొనాల్డో విషయంలో తీసుకొన్న కఠిన నిర్ణయం వ్యూహాత్మకమైంది. జట్టు విషయంలో మనసుతోకాదు.. మెదడుతో ఆలోచించాను. అలాగని రొనాల్డో గొప్ప ఆటగాడు కాకుండా పోడు. దానికి దీనికి సంబంధంలేదు. కొన్ని సందర్భాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో అదృష్టం కూడా కలిసి రావాలి" అని పేర్కొన్నాడు. శాంటోస్‌ను మరికొన్నాళ్లలో జట్టు నుంచి తొలగించొచ్చనే వార్తలు వస్తున్నాయి. క్రిస్టియానో రొనాల్డోను కీలక మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితం చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు.
అదో మతిలేని నిర్ణయం..!
ఛాంపియన్ ఆటగాడిని కీలక మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితం చేయడం తప్పుడు నిర్ణయమని రొనాల్డో జీవిత భాగస్వామి జార్జియాన రోడ్రిగజ్ విమర్శించారు. కోచ్ శాంటోస్ నిర్ణయంతో పోర్చుగల్ ఓటమి మూటగట్టుకొందన్నారు. "ఈ రోజు మీ మిత్రుడు, కోచ్ నిర్ణయం తప్పు. నువ్వు ఏ మిత్రుడిని గౌరవిస్తావో అతడే నిన్ను ఈ రోజు మైదానంలోకి దింపి పరిస్థితులు ఏవిధంగా మారతాయో చూశాడు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. మీ వద్ద ఉన్న ఆయుధమైన ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిని తక్కువగా అంచనావేయ కూడదు. అర్హత లేని వారి పక్షాన నిలబడకూడదు" అని కోచ్ శాంటోస్‌ను ఆమె తప్పుపట్టారు. మరోవైపు క్రిస్టియానో రొనాల్డోకు వీడ్కోలు పలుకుతూ ఫిఫా ట్విటర్‌లో థాంక్యూ అని సందేశాన్ని ఉంచింది.