అన్నను చూసి వెయిట్‌లిఫ్టింగ్‌లోకి.. పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా జిల్లా దేవుల్‌పురి గ్రామానికి చెందిన అచింత షూలిది పేద కుటుంబం. తండ్రి వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అచింత అన్న అలోక్‌కు చిన్నప్పటి నుంచి బరువులెత్తడం అంటే చాలా ఇష్టం. దాంతో అతడు వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. అచింత ఎప్పుడూ అన్న వెంటే ఉండేవాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ కోసం అలోక్ వెళ్తే అతడూ వెళ్లేవాడు. అలా అన్నను చూసి స్ఫూర్తి పొందిన అచింత.. తాను కూడా ఈ రంగంలోకి రావాలనుకున్నాడు. అతడిని ఆసక్తిని గమనించిన స్థానిక కోచ్ అస్తానా దాస్ అచింతకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు.
తండ్రి అంత్యక్రియలకు డబ్బుల్లేక.. ఇలా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని కుదుపు. 2013లో అచింత తండ్రి అకస్మాత్తుగా మరణించారు. అన్నదమ్ములిద్దరూ చిన్నవారే. తల్లికి పెద్దగా లోకం తెలియదు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు కూడా లేకపోవడంతో అచింత బోరున ఏడ్వడం తనకిప్పటికీ గుర్తేనని అలోక్ చెబుతుంటారు. తండ్రి మరణంతో రోజు గడవడం భారమైంది. కుటుంబాన్ని పోషించడం కోసం ఇంటర్ చదువుతున్న అలోక్ చదువు మానేసి చిన్న కూలి పనిలో చేరాడు. ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో అలోక్ తన కలను పక్కనబెట్టాడు. కానీ, తన కలను తమ్ముడి ద్వారా నెరవేర్చుకోవాలని భారమైనా సరే అచింతకు వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు.
ఆర్మీ ఇనిస్టిట్యూట్.. జీవితాన్ని మార్చేసింది.. తండ్రి మరణాన్ని గుండెల్లో దిగమింగుకుని 2013లో అచింత జూనియర్ స్థాయి జాతీయ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో పాల్గొన్నాడు. అయితే ఆ పోటీల్లో అచింత నాల్గో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సరైన డైట్ తీసుకోవడానికి సాధ్యపడలేదు. దీంతో 2014లో అచింత ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో అతడి ప్రదర్శనను గుర్తించిన ఆర్మీ ఇనిస్టిట్యూట్ కోచ్‌లు అతడిని ఎంపిక చేశారు. 2015లో నేషనల్ క్యాంప్ నుంచి అచింతకు పిలుపొచ్చింది. అక్కడ శిక్షణ తీసుకుని యూత్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు మళ్లీ ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కొనసాగాడు.
2018 నుంచి నేషనల్ క్యాంప్‌లో ఉంటున్న అచింత.. అదే ఏడాది జరిగిన ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. 2019లో జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాడు. 2021లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గాడు. 2020 ఒలింపిక్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 0.02 పాయింట్ల తేడాతో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. అయితేనేం.. ఇప్పుడు జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో ఏకంగా స్వర్ణం సాధించి దేశం గర్వపడేలా చేశాడు. అన్న అలోక్ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని అచింత గర్వంగా చెబుతున్నాడు. అందుకే ఈ పతకాన్ని కూడా అన్నకే అంకితమిచ్చాడు..!
ఇదీ చూడండి: స్టన్నింగ్ క్యాచ్.. ఒంటిచేత్తో అవలీలగా.. వీడియో వైరల్