మహిళల ప్రిమియర్ లీగ్‌లో భాగంగా ముంబయితో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. అలాగే డబ్ల్యూపీఎల్‌లో ఓటమి ఎరుగని ముంబయికి పరాజయాం రుచి చూపించింది. ఇది ముంబయి జట్టుకు తొలి ఓటమి. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. లక్ష్యాన్ని 19.3 ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తాహిలా మెక్‌గ్రాత్(38; 25 బంతుల్లో 6×4, 1×6), గ్రేస్ హారిస్ (39; 28 బంతుల్లో 7×4) జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. ముంబయి బౌలర్లలో అమేలియా కేర్ రెండు వికెట్లు తీయగా.. బ్రంట్, హెయిలీ మ్యాథ్యూస్, వోంగ్ తలో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దేవికా వైద్య(1) ఒక్క పరుగు కూడా చేయకుండానే తీవ్ర నిరాశ పరిచింది. హెయిలీ వేసిన 1.1వ బాల్‌కు.. హర్మన్ ప్రీత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. మరో ఓపెనర్ హీలీ (8) కూడా వోంగ్ బౌలింగ్‌లో తక్కువ రన్స్‌కే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌తో కలిసి నవ్‌గిరే ఇన్నింగ్స్(12) నిర్మించడానికి ప్రయత్నం చేసింది. కానీ టీమ్ స్కోరు 27 రన్స్ వద్ద బ్రంట్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి భాటియా చేతికి చిక్కింది.
ఆ తర్వాత హారిస్‌తో కలిసి మెక్‌గ్రాత్ ఆచితూచి ఆడింది. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ ఇద్దరూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే, ఈ జోడీని అమీలియా కేర్ విడగొట్టింది. టీమ్ స్కోరు 71 రన్స్ దగ్గర మెక్‌గ్రాత్ కాట్ ఆండ్ బౌల్డ్‌గా వెనుదిరిగింది. కేర్ వేసిన 15.4వ బంతికి వోంగ్‌కు క్యాచ్ ఇచ్చి హారిస్ కూడా ఔట్ అయింది. దీంతో జట్టు ఒక్కసారిగా మళ్లీ కష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (13*), సోఫీ (16*) చాలా కష్టంగా లక్ష్యాన్ని ఛేదించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 127 రన్స్ చేసింది. ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్ (35; 30 బంతుల్లో 1×4, 3×6) రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (25), వోంగ్ (32) తప్ప మిగత వారు రాణించలేకపోయారు. యూపీ బౌలర్లలో ఎక్లెస్టోన్ 3 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్, దీప్తిశర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంజలి శ్రావణ ఒక వికెట్ తీసింది.
ఇదీ చూడండి: ఐపీఎల్ అందాల యాంకర్లు.. వీరు మైదానంలో ఉంటే ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు