టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది జనవరిలో ఐసీసీ ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టగా.. విరాట్‌కు తొలిసారి ఈ అవార్డు వరించింది. అక్టోబర్ నెలలో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాలను ఐసీసీ ఈ అవార్డు కోసం నామినేట్ చేసింది. కానీ అభిమానులు మాత్రం విరాట్‌కే ఈ అవార్డును కట్టబెట్టారు.
కలిసొచ్చిన అక్టోబర్.. ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగిన కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్ ప్రారంభమైన అక్టోబరు నెలలో విరాట్ రెండు అర్ధ సెంచరీలతో 205 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు.
జట్టును విజయతీరాలకు.. మరోవైపు పెర్త్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చిన డేవిడ్ మిల్లర్.. ఈ అవార్డు కోసం కోహ్లీతో పోటీపడ్డాడు. భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో అక్టోబర్ నెలను ప్రారంభించిన మిల్లర్ మూడు వన్డేల్లో 117 పరుగులు చేశాడు. రెండు టీ20ల్లో 125 పరుగులు చేసిన మిల్లర్.. గువాహటిలో 79 బంతుల్లో 106* అజేయ సెంచరీతో రాణించాడు.
ఇక జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్‌కు నామినేట్ అయ్యాడు. సూపర్-12 రౌండ్-1లో పాకిస్థాన్‌ను మట్టికరిపించడంలో రజా కీలక పాత్ర పోషించాడు. కాగా, ఆగస్టులోనూ ఈ అవార్డు రజాకే దక్కడం గమనార్హం. రజా ఆరు టీ20ల్లో 145 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీశాడు. రజా మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఐర్లాండ్‌పై 82* పరుగులు చేయగా, పాకిస్థాన్‌పై 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్.. ఆ ప్లాన్ అమలు చేస్తే విజయం మాదే: రోహిత్