Afro-Asia Cup: ఆధునిక క్రికెట్లో మేటి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ ఒకే జట్టులో ఆడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ, పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా..? ప్రత్యర్థి జట్టుకి చుక్కలే.. ఇక జస్ప్రీత్ బుమ్రా, షహీన్ అఫ్రిది కలిసి బౌలింగ్ చేస్తే..? వీరికి హసరంగ, యుజ్వేంద్ర చాహల్ కూడా కలిస్తే..? ఇక ఆ విధ్వంసం మీ ఊహకే వదిలేస్తున్నాం.
అసలు ఇవన్నీ కలలో కూడా జరుగుతాయా..? కలలో ఏమో గానీ వాస్తవంగా కార్యరూపం దాల్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అదెలా..? ఈ ప్రశ్నకు సమాధానమే 'ఆఫ్రో-ఆసియా కప్'. టీ20, ఇతర క్రికెట్ టోర్నీల వల్ల మరుగున పడ్డ ఈ టోర్నీ మళ్లీ రాబోతుంది. ఈ మేరకు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బీసీసీఐ, పీసీబీతో పాటు ఆఫ్రికా ఖండంలోని క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ తెలిపాడు.
"అవును. మేం దాని (ఆఫ్రో-ఆసియా కప్) పై చర్చిస్తున్నాం. ఈ మేరకు ఆయా బోర్డులకు ప్రతిపాదనలు పంపాం. అయితే ఇది ఇప్పటికీ పేపర్ మీదే ఉంది. కానీ మేం ఎలాగైనా దీనిని నిర్వహించాలని భావిస్తున్నాం. ప్రపంచంలోనే మేటి జట్లుగా ఉన్న ఇండియా, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి జట్లు కలిసి ఆడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. బోర్డుల నుంచి సమ్మతి కోసం మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం."
-- ప్రభాకరన్ తన్రాజ్, ఏసీసీ కమర్షియర్ అండ్ ఈవెంట్స్ హెడ్
మరి ఆసియా-ఆఫ్రికా కప్ జరుగుతుందా..? అనేది ఆయా దేశాల బోర్డుల మీద ఆధారపడి ఉంది. గతంలో రెండేళ్లకోసారి ఈ టోర్నీని నిర్వహించేవారు. 2005లో షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కలిసి ఆసియా తరఫున ఆడారు. 2007లో చివరిసారిగా ఈ టోర్నీ జరిగింది.
ఇవీ చదవండి: T20 Worldcup: పంత్ వర్సెస్ దినేశ్ కార్తీక్.. అవకాశం దక్కేదెవరికో?
పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి, బట్టలు విప్పేసి కొట్టారు: మాజీ క్రికెటర్