Virat Kohli 76th Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. విండీస్‌తో జరుగుతున్న టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 87 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీ.. కెరీర్లో 76వ శతకాన్ని అందుకున్నాడు. ఇది కోహ్లీకి టెస్టుల్లో 29వ సెంచరీ కాగా.. వెస్టిండీస్‌పై అతడికి ఇది మూడో శతకం. అయితే ఇప్పటికే అత్యధిక టెస్టు పరుగుల్లో భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించిన విరాట్.. ఇప్పుడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ (8,643)ను కూడా దాటేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 49.30 సగటుతో 8,655 పరుగులతో కొనసాగుతున్నాడు.
ఈ సెంచరీతో విరాట్ మరో ఘనత అందుకున్నాడు. సెంచరీల జాబితాలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ (28), మైకెల్ క్లార్క్ (28), హషీమ్ ఆమ్లా (28)ను వెనక్కినెట్టి విరాట్.. క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ (29) ను సమం చేశాడు. ఆయితే బ్రాడ్‌మన్ కేవలం 52 టెస్టుల్లోనే 29 సెంచరీలు బాదగా.. విరాట్ మాత్రం ఆ మార్క్‌ను అందుకునేందుకు 111 టెస్టులు తీసుకున్నాడు. ఇక విరాట్ మొత్తంగా 25,582 అంతర్జాతీయ పరుగులతో సచిన్ తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక అత్యధిత శతకాలు సాధించిన టాప్ 5 బ్యాటర్లు..
- సచిన్ తెందూల్కర్ (భారత్) - 100 సెంచరీలు
- విరాట్ కోహ్లీ (భారత్) - 76
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 71
- కుమార సంగక్కర (శ్రీలంక) - 63
- జాక్ కలీస్ (సౌతాఫ్రికా) - 62
మరోవైపు భారత్ రెండో రోజు లంచ్ సమయానికి 373/6 తో నిలిచింది. ఆల్‌రౌండర్ జడేజా (61) కెరీర్లో 19వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన జడేజాను రోచ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ (18*), రవిచంద్రన్ అశ్విన్ (6*) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో కెమర్ రోచ్ రెండు, గాబ్రెల్, జోమెల్ వరికాన్, జేసన్ హోల్డర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ (80), జైస్వాల్ (57) పరుగులు చేసి జట్టుకు శుభారంభం ఇచ్చారు.