Types Of Ducks In Cricket : క్రికెట్లో బ్యాటర్ డక్ ఔట్ అవ్వడం అంటే దాదాపు అందరికీ తెలిసిందే. కానీ క్రికెట్లో ఎన్ని రకాల డకౌట్లు ఉంటాయో మాత్రం ఎక్కువ మందికి తెలీదు. ఏ బ్యాటర్ అయినా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు.. వీలైనన్ని పరుగులు చేసి.. తమ జట్టుకు భారీ స్కోరు అందించాలని అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు బ్యాటర్లు తాడబాటు గురయ్యో, లేదా ఇతర ఏవైనా కారణాల వల్లనో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరతారు. అలా సున్నాకు ఔట్ కావడాన్నే డకౌట్ అంటారు. మరి క్రికెట్లో ఉన్న 9 రకాల డకౌట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- గోల్డెన్ డకౌట్/ డకౌట్ : క్రీజులోకి వచ్చిన బ్యాటర్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఔట్ అయితే అది గోల్డెన్ డకౌట్.
- సిల్వర్ డకౌట్ : బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేయకుండా తాను ఎదుర్కొన్న రెండో బంతికి పెవిలియన్ బాట పడితే అది సిల్వర్ డకౌట్ అంటారు. ఈ తరహా డకౌట్లు కూడా చాలా సాధారణంగా చూస్తూనే ఉంటాం.
- బ్రాంజ్ డకౌట్ : ఓ బ్యాటర్ పరుగులేమీ సాధించకుండా మూడో బంతికి వెనుదిరగడమే బ్రాంజ్ డకౌట్.
- డైమండ్ డకౌట్ : ఈ డకౌట్ కొంచెం విచిత్రమైనది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్ ఒక్క బంతి కూడా ఆడకుండా.. ఔట్ అయితే దానిని డైమండ్ డకౌట్ అంటారు. అంటే బ్యాటర్ క్రీజులోకి వచ్చి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నప్పుడు.. పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా నిష్క్రమిస్తే.. అదే డైమండ్ డకౌట్. వైడ్ బంతికి స్టంపౌట్ అయినప్పుడు కూడా డౌమండ్ డక్ అవ్వొచ్చు. ఈ తరహా డకౌట్లు ఎక్కువగా టీ-20 క్రికెట్లో అవుతుంటాయి.
- రాయల్/ప్లాటినమ్ డకౌట్ : ఓ టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ బ్యాటర్ మొదటి బంతికే ఔట్ అవ్వడాన్ని రాయల్/ప్లాటినమ్ డకౌట్‌గా అభివర్ణిస్తారు.
- లాఫింగ్ డకౌట్ : ఓ జట్టు ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాటర్ సున్నా పరుగులతో వెనుదిరిగితే అదే లాఫింగ్ డకౌట్. లేదా బ్యాటర్ ఔట్ అయిన ఆ బంతితోనే ఇన్నింగ్స్ ముగిసినా.. దానిని లాఫింగ్ డకౌట్ అంటారు.
- పెయిర్ డకౌట్ : టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో బ్యాటర్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగులు ఏమీ సాధించకుండా.. ఔట్‌గా పెవిలియన్ చేరితే దానిని పెయిర్ డకౌట్ అంటారు.
- కింగ్ పెయిర్ : కింగ్ పెయిర్ డకౌట్‌కు, పెయిర్ డకౌట్‌తో చాలా దగ్గరి పోలిక ఉంది. ఒక టెస్టు మ్యాచ్‌లో బ్యాటర్ రెండు ఇన్నింగ్స్లోలనూ.. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అయితే దానిని కింగ్ పెయిర్ డకౌట్‌గా పిలుస్తారు.
- బ్యాటింగ్ హ్యాట్రిక్ : హ్యాట్రిక్ అంటే మామూలుగా అందరికీ తెలిసిందే. క్రికెట్లో ఈ పదం బౌలర్లకు ఎక్కువ వాడతారు. అయితే బ్యాటర్ వరుసగా 3 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అయితే హ్యాట్రిక్ డకౌట్ అంటారు. కానీ ఈ బ్యాటింగ్ హ్యాట్రిక్ చాలా అరుదుగా నమోదు అవుతుంది.