Top 5 all format bowlers in 2021: కరోనా వల్ల క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. ఆటగాళ్లు.. బయోబబుల్, క్వారంటైన్లో ఉంటూ మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమవంతు ప్రదర్శన చేస్తూ అభిమానులను అలరించారు. చాలా మంది ప్లేయర్లు ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించారు. వీరిలో బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తే, బౌలర్లు టోర్నీ విజయాల్లో కీలకంగా వ్యవహరించి సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. ఓ సారి ఈ ఏడాది మొత్తాన్ని నెమరువేసుకుంటే ప్రతి జట్టులోనూ బలమైన బౌలింగ్ లైనప్ కనపడుతోంది. ప్రపంచంలోని ప్రతిజట్టుపై వీరు అద్భుత ప్రదర్శన చేస్తూ కీలక వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా, ఈ ఏడాది ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి సత్తా చాటిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం..
అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా
రవిచంద్రన్ అశ్విన్.. టీమ్ఇండియాకు కీలక స్పిన్నర్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఈ ఏడాది అద్భుతంగా రాణించి భారత జట్టు సాధించిన అద్భుత విజయాల్లో భాగస్వామమ్యాడు. ఆడిన ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో 16.23 సగటుతో 52 వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన ఇతడిదే. అందులో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 14.71 సగటుతో 32 వికెట్లను సాధించాడు. అయితే చాలా కాలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన ఇతడు తన ఆటతో టీ20 ప్రపంచప్‌లో అవకాశం తుదిజట్టులోనూ అవకాశం దక్కించుకుని సత్తాచాటాడు.
![ashwin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14039638_aswin.jpg)
కోహ్లీ, రోహిత్ వికెట్లను
ఈ మధ్య కాలంలోని గణాంకాలు చూస్తే పాకిస్థాన్ ఉత్తమ బౌలర్‌గా షాహీన్ అఫ్రిది పేరు ఎక్కువగా వినపడుతోంది. అన్ని ఫార్మాట్లలో అతడు బాగా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్, రాహుల్ వంటి కీలక వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 9 టెస్టుల్లో 47 వికెట్లు తీసి ఈ ఏడాది అత్యధిక వికెట్లను పడగొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇందులో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉండగా.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పది వికెట్లతో దుమ్మురేపాడు.
![shaheen afridi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14039638_shaheen-afridi.jpg)
ఆరు వికెట్ల ప్రదర్శనతో ఘనంగా
దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ ఎన్రిజ్ నోర్జ్టే.. ఈ ఏడాది టీ20, టెస్టు ఫార్మాట్లో అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసి ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లోనూ 26.88 సగటుతో ఏకంగా 9 వికెట్లను తీసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఆడిన ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో 20.76 సగటుతో 25 వికెట్లు తీయగా.. 11 టీ20ల్లో 15 వికెట్లను దక్కించుకున్నాడు.
![anrich norje](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14039638_anrich.jpg)
టీ20 ప్రపంచకప్ విజయంలో కీలకంగా
జోష్ హెజిల్వుడ్.. కొద్దికాలంగా అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియా జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఆసీస్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ లాంటి కీలక వికెట్‌ను తీయడం సహా 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు. ఈ ఏడాది టీ20ల్లో 15మ్యాచ్‌లు ఆడి 6.88 ఎకానమీ రేట్‌తో 23 వికెట్లు తీశాడు. టెస్టుల్లోనూ ఆరు మ్యాచ్‌లు ఆడి 21.8 సగటుతో 13 వికెట్లను దక్కించుకున్నాడు.
![josh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14039638_josh-hazlewood.jpg)
టెస్టు ఛాంపియన్షిప్ విజయంలో కీలకంగా
టెస్టు క్రికెట్లో బాగా రాణించే టిమ్ సౌథీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని ముద్దాడడంలో కీలకంగా వ్యవహరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ లైన్‌ప్‌ను 4/48తో దెబ్బతీశాడు.
మొత్తంగా ఈ ఏడాది పది టెస్టు మ్యాచ్‌లు ఆడిన సౌథీ 23.5 సగటుతో 22 వికెట్లను తీశాడు. అందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత్‌లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతడు చేసిన ఐదు వికెట్ల ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక టీ20ల్లోనూ తనదైన ముద్రవేశాడు. 17మ్యాచ్‌ల్లో 7.26 ఎకానమీ రేట్‌తో 24 వికెట్లను దక్కించుకున్నాడు.
![tim southee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14039638_tim-southee.jpg)
ఇదీ చూడండి: Rewind 2021: ఈ ఏడాది టీమ్ఇండియా రికార్డులివే!