మూడేళ్ల నిరీక్షణకు తెర దింపాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో వన్డేలో శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 84 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకాడు హిట్ మ్యాన్. కాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా 2020 జనవరి 19వ తేదీన ఆస్ట్రేలియా మీద చివరిసారిగా రోహిత్ మూడంకెల స్కోరును నమోదు చేశాడు. ఎట్టకేలకు ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, 9 ఫోర్లు ఉన్నాయి. అయితే వన్డే కెరీర్‌లో రోహిత్‌కు ఇది 30వ శతకం. ఇక డబుల్ సెంచరీ సాధిస్తాడన్న ఆశతో ఉన్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. సెంచరీ కొట్టిన వెంటనే ఔటై పెవిలియన్‌కు చేరాడు.
మరోవైపు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (112) కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీతో అదరగొట్టిన గిల్.. మూడో వన్డేలోనూ సెంచరీ పూర్తి చేశాడు. కాగా గిల్ కేవలం 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో ఈ రికార్డు సాధించడం విశేషం. ప్రస్తుతం 28 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఇందులో కేవలం బౌండరీల ద్వారానే 156 పరుగులు రావడం గమనార్హం. క్రీజ్‌లో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ ఉన్నారు.