Team India Biggest Winnings In CWC : భారత్ ఆతిథ్యం ఇస్తున్న 2023-వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. ఈ నెల 12తో లీగ్ స్టేజీ మ్యాచులు అయిపోతాయి. ఈ టోర్నీలో టీమ్ఇండియా మంచి దూకుడు మీద ఉంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ ముందుకెళుతోంది. వరుసగా 8 విజయాలు సాధించింది. దీంతో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. కాగా, కొన్ని మ్యాచుల్లో భారీ పరుగుల తేడాతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. ఇదిలా ఉంటే ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో ఏయే ప్రత్యర్థి జట్లపై భారీ పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయాలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలంకపై 302 పరుగులతో..
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలోనే భారత్.. ప్రపంచ కప్ చరిత్రలోనే పరుగుల పరంగా తన రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 302 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 357 పరుగులు భారీ స్కోర్‌ను లంక టీమ్ ముందుంచుంది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత్ ఖాతాలో మరో భారీ విజయం చేరింది.
బెర్ముడాపై 257 పరుగులతో..
2007-వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా బెర్ముడా జట్టుపై 257 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 5 వికెట్లు కోల్పోయి 413 రన్స్ చేసింది. తర్వాత ప్రత్యర్థి బెర్ముడాను 156 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 257 పరుగుల తేడాతో గెలిచి భారీ విజయాన్ని దక్కించుకుంది.
దక్షిణాఫ్రికాపై 243 పరుగులతో..
ఈనెల 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది టీమ్ఇండియా. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 327 భారీ టార్గెట్‌ను సఫారీల ముందుంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆ జట్టు 83 పరుగులకే కుప్పకూలింది. ఈ విక్టరీతో ప్రపంచకప్ చరిత్రలోనే మరో మరుపు రాని రికార్డును భారత్ తన ఖాతాలో వేసుకుంది.
శ్రీలంకపై 183 పరుగులతో..
2003 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా.. శ్రీలంక జట్టుపై అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలోని జెహనెస్ బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగుల తేడాతో లంక జట్టును ఓడించింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరులో తలపడ్డ టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. దీంతో రెండో సారి కూడా కప్పును ముద్దాడే అవకాశాన్ని చేజార్చుకుంది.
విరాట్ టు వార్నర్- ప్రపంచ కప్‌లో టాప్ -5 బ్యాటర్లు వీరే!
వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లదే హవా - ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా వివ్ రిచర్డ్స్!