సంజూ శాంసన్ సామర్థమున్న ఆటగాడు.. అద్భుతమైన టాలెంట్ అతడి సొంతం. బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుంది. ఇలా రకరకాల సందర్భాల్లో మాజీలు అతడిని ప్రశంసించారు. స్వయంగా ప్రస్తుత టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ 2013లోనే సంజూ సత్తా ఏంటో గుర్తించాడు. ఆ సమయంలో భారత టీ20లీగ్‌లోకి రాజస్థాన్ తరఫున సంజూ అరంగేట్రం చేశాడు. అప్పుడు ఆ జట్టు కెప్టెన్‌గా ద్రావిడ్ ఉన్నాడు. బెంగుళూరుతో జరిగిన ఓ మ్యాచ్‌లో సంజూ 41 బంతుల్లేనే 63(7 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే, 18 ఏళ్ల వయసులోనే సంజూ ఆడిన షాట్లు చూసి ద్రావిడ్ అభినందించాడు. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడటంతో 2015 జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సంజూ ఎంపికయ్యాడు. సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో అవకాశం రాగా 19 పరుగులే చేసి విఫలం అయ్యాడు. అంతే సంజూకి ఇంకో ఐదేళ్ల వరకు ఛాన్స్ ఇవ్వలేదు. మళ్లీ 2020లో జాతీయజట్టు నుంచి పిలుపువచ్చిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. టాలెంట్ నిరూపించుకోవడానికి అతడికి ఒకే అవకాశం ఇచ్చారని.
ఫామ్‌లో లేక కాదు..!.. 2015 నుంచి భారత టీ20లీగ్‌తో పాటు, దేశవాళీ క్రికెట్‌లో సంజూ రాణించాడు. 2018 సీజన్‌లో మెరుపులు మెరిపించిన రిషభ్‌పంత్ ఆ ఏడాదే భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అయితే.. సంజూకి మాత్రం అవకాశం రాలేదు. 2018లో 137.81 స్ట్రెక్‌రేట్‌తో 441, 2019లో 148.69 స్ట్రెక్‌రేట్‌తో 342 పరుగులు సాధించినా.. శాంసన్‌కు అప్పుడు ఛాన్స్ రాలేదు. ఇక.. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఆడిన మొదటి బంతినే సిక్సర్‌కు తరలించిన సంజూ వెంటనే ఔటయ్యాడు. అదే నెల చివర్లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయినా.. విఫలం అయ్యాడు. దీంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది. సంజూని పక్కనపెట్టారు.
2020 భారత టీ20లీగ్‌లో 158.39 స్ట్రెక్‌రేట్‌తో 375 పరుగులు చేయడంతో అదే డిసెంబర్‌లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేశారు. ఇక్కడ తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో 23తో పర్వాలేదనిపించినా , తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో దూకుడుగా ఆడే ప్రయత్పంలో 15, 10 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ 2021లో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. అక్కడ హసరంగా బౌలింగ్‌లో ఇబ్బందిపడటంతో ఆ సిరీస్‌లో విఫలమయ్యాడు. 2021 భారత టీ20 లీగ్‌లో 136.72 స్ట్రెక్‌రేట్‌తో 484 పరుగులు చేశాడు. దీంతో 2022లో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సెలక్ట్ అయ్యాడు. ఇక్కడ తొలి మ్యాచ్‌లో అవకాశం రాలేదు. ఆ తర్వాతి మ్యాచ్‌లో 24 బంతుల్లో 39, చివరి మ్యాచ్‌లో 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు.
ఇలా అయితే ఎలా రాణిస్తాడు..!.. ఇక 2022 భారత టీ20 లీగ్‌లో 146.79 స్ట్రెక్‌రేట్‌తో 458 పరుగులు చేశాడు. దీంతో స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంజూని ఎంపికచేస్తారని అంతా భావించారు. కానీ ఇక్కడ నిరాశే మిగిలింది. దాని తర్వాత జరిగిన ఐర్లాండ్ సిరీస్‌లో ఆడించారు. అక్కడ 77 పరుగులతో రాణించాడు. అయితే, సంజూని తర్వాత జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో పక్కన పెట్టి.. మళ్లీ విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికచేశారు. ఇక్కడ అర్థశతకంతో మెరిసిన సంజూకి టీ20 సిరీస్‌లో ఛాన్స్ ఇవ్వలేదు. అయితే, కేఎల్ రాహుల్‌కు గాయమవ్వడంతో చివరి రెండు టీ20ల్లో ఆడించేందుకు శాంసన్‌ను అక్కడికి పంపించారు. ఇక్కడ ఆడిన తొలి మ్యాచ్‌లో 23 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినా.. తర్వాతి మ్యాచ్‌లో 15 పరుగులే చేశాడు. అంతే మళ్లీ సేమ్ సీన్ రిపీట్. తాజాగా ఎంపిక చేసిన ఆసియాకప్ బృందంలో చోటివ్వలేదు.
సంజూ శాంసన్‌కి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వరుసగా నాలుగుమ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వలేదు. సంజూ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 16 టీ20లు, 4 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇలా అయితే.. రానున్న టీ20 ప్రపంచకప్‌కు సంజూని ఎంపిక చేయడం ప్రశ్నార్థకమే..! దీంతో సంజూకి అన్యాయం జరుగుతోందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వరుసగా అవకాశాలు ఇవ్వకపోతే ఎలా రాణిస్తాడని మండిపడుతున్నారు. దినేశ్ కార్తీక్, పంత్, అయ్యర్‌లకు అవకాశాలు ఇస్తున్నారు. మరీ సంజూకి ఎందుకివ్వట్లేదని అతడి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: దాదా, అజారుద్దీన్ కాంట్రవర్సీ ట్వీట్స్.. ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్