టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్ బెర్తును ఖాయం చేసుకొన్న తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఐర్లాండ్ తన చివరి మ్యాచ్‌లో ఓటమితో ఇంటిముఖం పట్టింది. కీలకమైన పోరులో ఐర్లాండ్‌పై 35 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 150/9 స్కోరుకే పరిమితమైంది.
8 ఓవర్లకు 68/0 నుంచి.. భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 8 ఓవర్లకు చేసిన స్కోరిది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (37), ఆండ్రూ బాల్బిర్నీ (30) నిలకడగా ఆడి స్కోరు బోర్డును నడిపించారు. అయితే కివీస్ స్పిన్నర్లు సోధి, సాంట్నర్ వరుస ఓవర్లలో ఓపెనర్లతోపాటు హ్యారీ టెక్టర్ (2) వికెట్‌ను తీయడంతో ఐర్లాండ్ కష్టాల్లో పడింది. అయితే లొర్కాన్ టక్కర్ (13), గెరెత్ డెలానీ (10), జార్జ్ డాక్‌రెల్ (23) కాసేపు ప్రయత్నించినా కివీస్ బౌలర్లు పట్టువిడవలేదు. చివరికి 150/9 స్కోరుకు పరిమితమై ఓటమిపాలైంది. లాకీ ఫెర్గూసన్ (3/22), టిమ్ సౌథీ (2/29), మిచెల్ సాంట్నర్ (2/26), సోధీ (2/31) ఐర్లాండ్‌ను కట్టడి చేశారు.
కేన్ సూపర్ ఇన్నింగ్స్.. ఐర్లాండ్ బౌలర్ హ్యాట్రిక్
ఇప్పటి వరకు విఫలమవుతూ వచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61: 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక సమయంలో ఫామ్ అందుకొన్నాడు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (32), కాన్వే (28) తొలి వికెట్‌కు అందించిన శుభారంభాన్ని (52 పరుగులు) విలియమ్సన్ కొనసాగించాడు. డారిల్ మిచెల్ (31*: 21 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి కేన్ నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. అయితే ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ తీయడంతో 200 మార్క్‌ను కివీస్ అందుకోలేకపోయింది. లిటిల్ వేసిన 19వ ఓవర్‌లోని వరుస బంతుల్లో కేన్‌తోపాటు నీషమ్ (0), సాంట్నర్ (0) వికెట్లను పడగొట్టాడు. తొలుత విలియమ్సన్ షాట్‌కు యత్నించి డెలానీ చేతికి చిక్కగా.. నీషమ్, సాంట్నర్‌ను లిటిల్ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
సెమీస్‌కు వెళ్లినట్లే.. సూపర్ -12 దశలో గ్రూప్ -1 నుంచి ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దుతో ఏడు పాయింట్లు సాధించిన కివీస్ (+2.11) నెట్‌రన్‌రేట్ బాగుంది. అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా.. శ్రీలంక మీద ఇంగ్లాండ్ విజయం సాధించినా కివీస్‌కు ఢోకా ఉండదు. అప్పుడు ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఏడేసి పాయింట్లతో ఉంటాయి. అయితే కివీస్ మంచి రన్‌రేట్‌తో తొలి స్థానం దక్కించుకోవడం ఖాయం. ఆసీస్, ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచుల్లో ఓడితే మాత్రం శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. ఇప్పుడు శ్రీలంక ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్‌పై లంక గెలిస్తే ఆరు పాయింట్లతో రెండో స్థానంతో సెమీస్‌కు చేరుకొంటుంది.
ఇదీ చూడండి: కోహ్లీతో దాని గురించే చర్చించా: కేఎల్ రాహుల్