భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌పై ప్రశంసలు కురిపించాడు మాజీ కెప్టెన్ ధోనీ. మాస్టర్లా తాను కూడా బ్యాటింగ్ చేయాలని ఆశించినట్లు గుర్తుచేసుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ కూడా సచిన్ అని తెలిపాడు. కాగా, 2004లో టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మహీ.. 2007లో కెప్టెన్ మారి అదే ఏడాది భారత జట్టుకు టీ20 వరల్డ్‌కప్‌ను అందించాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కలను నెరవేరుస్తూ 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలిచి.. అతనికి బహుమతిగా అందించాడు.
"క్రికెట్‌లో నా రోల్ మోడల్ సచిన్ తెందుల్కర్. అతడి బ్యాటింగ్ చూస్తూ పెరిగాను. అతనిలానే బ్యాటింగ్ చేయాలని చాలా ఆశించా. కానీ.. ఆ తర్వాత అది కష్టమని నాకు అర్థమైంది. అయితే.. మనసులో మాత్రం సచిన్‌లా ఆడాలనే కోరిక అలానే ఉండేది" అని ధోనీ గుర్తు చేసుకున్నాడు.
1989లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్.. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఏకంగా ఆరు వరల్డ్‌కప్‌లు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్ అతడికి చివరిది. ఈ మెగాటోర్నీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 18 పరుగులకే సచిన్ ఔటైపోయాడు. అయితే చివరి వరకూ క్రీజులో నిలిచిన ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేసి భారత్ 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించడమే కాకుండా సచిన్ కలనీ నెరవేర్చాడు. ఇక సచిన్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
కాగా, ఐపీఎల్లో అత్యంత స్థిరమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు (సీఎస్‌కే) పేరుంది. అలాంటి జట్టుకు ప్రారంభ సీజన్ నుంచి మొన్న జరిగిన 14వ సీజన్ వరకు సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోనీ.. తన కెప్టెన్సీలో సీఎస్‌కేను తొమ్మిదిసార్లు ఫైనల్స్‌కు చేర్చాడు. నాలుగు సార్లు కప్ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించినా తనలోని నాయకత్వ లక్షణాల్లో వన్నె తగ్గలేదని నిరూపించాడు. మొత్తంగా ఐపీఎల్లో 234 మ్యాచులు ఆడి 4978 రన్స్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే.. 90 టెస్టులు ఆడిన ధోని 144 ఇన్నింగ్స్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డేలు ఆడగా, 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10శతకాలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 98 టీ20లు ఆడగా 1617 రన్స్ చేశాడు.
ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. మరో రెండు రోజులే