T20 World Cup : టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్ జట్టు గాయాలతో సతమతమౌతోంది. జస్ప్రీత్ బుమ్రా, జడేజా వంటి ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు. అయితే జడేజా స్థానంలో అక్షర్ పటేల్ రాణిస్తాడని విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా అక్షర్ మంచి ప్రదర్శనే చేస్తున్నాడు. అయితే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న చర్చ జరిగింది. మహ్మద్ సిరాజ్ అయితే బాగుంటుందని కొందరు విశ్లేషించారు. మరికొందరు బుమ్రా స్థానాన్ని మహ్మద్ షమీ భర్తీ చేయగలడని అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నిటికీ తెరదించుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేసింది.
"ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో జస్ప్రీత్ బుమ్రాకు రిప్లేస్‌మెంట్‌గా మహ్మద్ షమీని ఆల్ ఇండియా సెలెక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే షమీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. వార్మప్ మ్మచ్కు ముందు బ్రిస్బేన్‌లో జట్టుతో కలుస్తాడు" అని బీసీసీఐ తెలిపింది.
మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌ను బ్యాక్అప్గా జట్టులోకి తీసుకున్నారు. వీరు త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. షమీకి గత టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన 6 టీ20 మ్యాచ్‌ల్లో షమీ ఆడాలి. కానీ కొవిడ్ సోకడం వల్ల షమీ ఆడలేకపోయాడు.
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ.
ఇవీ చదవండి: T20 worldcup: అన్ని లక్షల టికెట్లు అమ్ముడైపోయాయా?