టీమ్ఇండియా జెర్సీ ధరించి ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల అని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer News) చెప్పాడు. ఈ రోజు తన కల నిజమైందని అన్నాడు. త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే టీ20 సిరీస్(IND vs NZ T20 series) కోసం బీసీసీఐ మంగళవారం తుది జట్టును ప్రకటించింది. అందులో తనకు చోటు దక్కడంపై యువ ఆల్-రౌండర్ వెంకటేశ్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు.
"టీమ్ఇండియాకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం నేను చాలా కష్టపడ్డాను. ఇంత త్వరగా జట్టుకు ఎంపికవుతానని అనుకోలేదు. నా ఫీలింగ్‌ను చెప్పడానికి మాటలు రావడం లేదు. నేను బ్యాటింగ్‌కు వెళ్లిన ప్రతిసారి మా జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించాను. నన్ను ఎంపిక చేసిన సెలెక్టర్లకు, కెప్టెన్‌కు.. నా ఎదుగుదలకు సాయపడిన కోచ్‌లకు, సీనియర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి క్రికెటర్‌కు టీమ్ఇండియా జెర్సీ ధరించి ఆడాలనేది ఓ కల. నా కల ఈ రోజు నిజమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడేందుకు చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను"
--వెంకటేశ్ అయ్యర్, టీమ్ఇండియా ఆటగాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer IPL) అద్భుతంగా రాణించాడు. 10 మ్యాచ్‌ల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేయడం సహా మూడు వికెట్లు కూడా తీశాడు.
నవంబరు 17 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం అయ్యర్‌తో పాటు, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన వీరిద్దరూ ప్రపంచకప్‌లో అంచనాలను అందుకోలేకపోయారు. దీంతో సెలెక్టర్లు న్యూజిలాండ్ సిరీస్‌కు వీరిద్దరినీ పక్కనపెట్టారు.
ఇదీ చదవండి: