Jasprit Bumrah Injury Update : టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడు వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ- ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. బుమ్రాతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా కోలుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రా మార్చిలో వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గత నెల నుంచి బౌలింగ్ చేయడం సాధన చేస్తున్నాడు. రోజుకు 8 నుంచి 10 ఓవర్లు నెట్లో బౌలింగ్ వేస్తున్నాడు. అయితే మొదట్లో ప్రతి రోజు 5 నుంచి 6 ఓవర్లు బౌలింగ్ వేసేవాడని.. తర్వాత దాన్ని పెంచినట్లు తెలుస్తోంది.
Asia Cup 2023 : సెప్టెంబరులో జరిగే ఆసియా కప్ 2023కు బుమ్రాను జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జట్టు యాజమాన్యం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గాయం కారణంగా గతేడాది సప్టెంబర్ నుంచి బుమ్రా క్రికెట్ ఆడటం లేదు. గాయాన్ని దృష్టిలో ఉంచుకుని అతడిపై అదనపు శ్రద్ధ తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం బుమ్రా బౌలింగ్ వేసేటప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురికావడం లేదని సమాచారం. దీంతోపాటు ఎన్సీఏలో బుమ్రా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీస్ స్టార్ట్!
Shreyas Iyer Injury Update : గత ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయం కారణంగా టీమ్ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ స్టార్ బ్యాటర్.. ఎన్సీఏలో కోలుకున్నట్లు తెలుస్తోంది. అతడు రోజు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక, బుమ్రాతో.. శ్రేయస్ కూడా ఐర్లాండ్ సిరీస్‌కు వెళ్లే అవకాశం ఉంది.
ఆసియా కప్‌నకు ప్రసిధ్.. సిద్ధం!
Prasidh Krishna Injury Update : నడుము నొప్పి కారణంగా బాధ పడిని బౌలర్ ప్రసిధ్ కృష్ణ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న ఇతడు కూడా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రసిధ్ తిరిగి బౌలింగ్‌ను ప్రారంభించాడని సమాచారం. అయితే ప్రపంచ కప్ 2023 సమయానికి అతడు ఫిట్‌గా ఉండగలడా లేదా అనే ఆందోళనలు ఉన్నాయి. వచ్చే నెలలో జరిగే ఐర్లాండ్ టూర్‌కు అతడు వెళ్తాడో లేదో ఖచ్చితంగా తెలియనప్పటికీ.. ఆసియా కప్ 2023 మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే, స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఫిట్‌నెస్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. కానీ రాహుల్ మాత్రం వరల్డ్ కప్ 2023లో ఆడే అవకాశం ఉంది. ఇక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్.. ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండడం అనుమానమే.
ఇలా గాయాలపాలైన ప్లేయర్లు కోలుకోవడం టీమ్ఇండియాకు శుభపరిణామమే అయినా.. వీరిలో ఎంత మంది వరల్డ్ కప్‌నకు పూర్తిగా సిద్ధంగా ఉంటారో తెలియదు. ఒకవేళ వీరు తిరిగి జట్టులో చేరితో టీమ్ఇండియాకు మరింత బలం చేకూరుతుంది.