- నాన్న లేడు.. కఠిక పేదరికం.. కడుపు నిండా తిండి తినలేని దైన్యం.. పిల్లల ఆకలి తీర్చడం కోసం అమ్మ కష్టం.. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడు క్రికెట్ బ్యాట్ పట్టాడు. ఆటలో సత్తాచాటి తమ పేదరికాన్ని దూరం చేస్తానని తల్లికి మాటిచ్చాడు. అందుకోసం శ్రమించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. అతనే రోమన్ పావెల్!
- 15 ఏళ్ల ఆ పిల్లాడికి క్రికెట్ అంటే పిచ్చి. నాన్నకు ఆర్థికంగా భారం అవకూడదని.. శిక్షణ కోసం ఒక్క రూపాయి కూడా అడగనని కుటుంబానికి చెప్పాడు. రాత్రి పూట పని చేస్తూ.. ఉదయం శిక్షణ పొందాడు. డబ్బుల్లేక ఏడాది పాటు మధ్యాహ్న భోజనం చేయలేదు. రూ.10 ఆదా చేసేందుకు కొన్ని మైళ్ల దూరం కాలినడకన వెళ్లేవాడు. ఇప్పుడు తన కలను నిజం చేసుకుంటూ టీ20 లీగ్‌తో అరంగేట్రం చేశాడు. తన స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతనే కుమార్ కార్తీకేయ సింగ్!
వీళ్లిద్దరి కథలు వేరే.. దేశాలు వేరు.. కానీ కల మాత్రం ఒక్కటే. పేదరికాన్ని దాటి.. ఇబ్బందులను అధిగమించి తమ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
అమ్మ కోసం: హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే అజేయంగా 67 పరుగులు చేసిన దిల్లీ ఆటగాడు పావెల్ అదరగొట్టాడు. అలవోకగా భారీ షాట్లు ఆడగలడనే పేరును నిజం చేస్తూ ఈ విండీస్ వీరుడు చెలరేగాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌ల్లో ఒకటైన టీ20 లీగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. కానీ అతను ఈ స్థాయికి చేరడం వెనక ఓ కన్నీటి గాథ ఉంది. ఓ నిశ్శబ్ద యుద్ధం ఉంది. ఓ తల్లి త్యాగం ఉంది. పావెల్ పిండంగా ఉండగానే కడుపు తీయించుకోవాలని ఆ తల్లిని ఆమె భర్త బలవంతం చేశాడు. కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆమె భర్తనే దూరం చేసుకుంది. ఒక్కో నెల కష్టంగా గడుపుతూ బిడ్డకు జన్మనిచ్చింది. అతణ్ని పెంచడం కోసం ఇతరుల ఇళ్లలో పని చేసేది. అమ్మకు సాయంగా ఉండేందుకు అతను మేకల కాపరిగానూ మారాడు. ఒక్కో పూట తినడానికి కూడా తిండి ఉండేది కాదు. రెండు గదుల చిన్న ఇంట్లో అష్టకష్టాలు పడుతూ జీవితం సాగించాడు. వర్షం పడితే ఇక రాత్రి జాగరణే. పైకప్పు నుంచి నీళ్లు వచ్చేవి. అలాంటి దుర్భర పరిస్థితులు చూసిన పావెల్.. ఒక రోజు క్రికెట్ బ్యాట్‌తో ఇంటికి తిరిగొచ్చాడు. ఆటతో పేదరికాన్ని దూరం చేస్తానని తల్లికి మాటిచ్చాడు. తన అమ్మ, సోదరికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం తీవ్రంగా శ్రమించాడు. సవాళ్లు ఎదురైనా కుంగిపోలేదు. తన తల్లి, సోదరిని గుర్తు తెచ్చుకుంటూ మరింత కష్టపడ్డాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. తన తల్లి కోసం కొత్త ఇల్లు కొనిచ్చాడు. దిగ్గజ ఆటగాళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు తన పేరు కూడా ఉండాలనేది తన లక్ష్యమంటున్నాడు.
ఖాళీ కడుపుతో: రాజస్థాన్‌తో ముంబయి మ్యాచ్.. యూపీ లెఫ్టార్మ్ ఆఫ్‌స్పిన్నర్ కార్తీకేయ సింగ్ టీ20 లీగ్ అరంగేట్రానికి వేదికైంది. మణికట్టుతో, చేతి వేళ్లతో బంతిని తిప్పుతూ.. ఆఫ్ స్పిన్, క్యారమ్.. ఇలా వైవిధ్యమైన బంతులు వేస్తూ మొదటి మ్యాచ్‌లో ఈ 24 ఏళ్ల ఆటగాడు ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి ప్రమాదకర శాంసన్ వికెట్ పడగొట్టాడు. ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్‌లో అడుగుపెట్టే ముందు తను ఒడుదొడుకుల ప్రయాణం సాగించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం పెంచుకున్న అతను.. 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి దిల్లీ చేరాడు. అక్కడ తన స్నేహితుడు రాధేశ్యామ్ తప్ప అతనికి ఎవరూ తెలీదు. శిక్షణ కోసం డబ్బులు అడగనని ఇంట్లో చెప్పి రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఎన్నో అకాడమీలు తిరిగాడు. కానీ డబ్బులు లేకపోతే ఉచితంగా ఎవరు శిక్షణనిస్తారు? చివరకు భరద్వాజ్ అకాడమీ చేరాడు. అక్కడ ట్రయల్స్‌లో అతని ప్రతిభకు మెచ్చి ఉచితంగా శిక్షణ అందించేందుకు గంభీర్ చిన్నప్పటి కోచ్ భరద్వాజ్ ముందుకు వచ్చాడు. కానీ ఎక్కడ ఉండాలి? ఏం తినాలి? అందుకే అకాడమీకి 80 కిలోమీటర్ల దూరంలోని ఓ పరిశ్రమలో పనిలో చేరాడు. అక్కడే మిగతా కార్మికులతో కలిసి గదిలో ఉన్నాడు. రాత్రుళ్లు పని.. పగలు ప్రాక్టీస్.. ఇదే అతని దినచర్య. కొన్నిసార్లు రూ.10 బిస్కెట్ ప్యాకెట్ కోసం డబ్బులు ఆదా చేసేందుకు కొన్ని మైళ్లు నడిచి వెళ్లేవాడు. అది తెలుసుకున్న కోచ్ తన అకాడమీ వంట మనిషితో కలిసి ఉండే సదుపాయం కల్పించాడు. అప్పటికీ ఏడాది పాటు మధ్యాహ్నం భోజనం చేయని అతనికి వంట మనిషి ఆహారం పెట్టేసరికి ఒక్కసారిగా కన్నీళ్లు ఉబికివచ్చాయి. మరోవైపు ఆటపై పట్టు సాధించి క్రమంగా మెరుగయ్యాడు. దిల్లీలో ట్రయల్స్‌లో మొండిచెయ్యి ఎదురవడంతో కోచ్ సలహా మేరకు మధ్యప్రదేశ్‌కు వెళ్లి అక్కడ సత్తాచాటాడు. డివిజన్ క్రికెట్లో తొలి రెండేళ్లలో 50కి పైగా వికెట్లు పడగొట్టాడు. అనంతరం రాష్ట్ర జట్టు తరపున రంజీల్లోనూ సత్తాచాటాడు. సంప్రదాయ స్పిన్నర్‌గా కెరీర్‌ను మొదలెట్టిన అతను.. టీ20ల్లో విజయవంతం కావడం కోసమని ప్రత్యేకంగా మణికట్టు ఉపయోగించి బంతులేయడంపై పట్టు సాధించాడు.
ఇదీ చూడండి: IPL 2022: పాత జట్లకు కొత్త చిక్కులు.. ముంచుతున్న పేలవ బౌలింగ్