మరో ఐదు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూసే ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం పది ఫ్రాంచైజీల ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కొంతమంది ప్లేయర్స్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. మరికొంతమంది రెండు మూడు రోజుల్లో తమ క్యాంపులకు చేరుకుని శిక్షణ ప్రారంభించనున్నారు. అయితే అన్ని ఫ్రాంచైజీలను గాయాల బెడద తీవ్రంగా కలవరపెడుతోంది.
గాయాల కారణంగా పలువురు ప్లేయర్లు సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు లేదంటే పూర్తి సీజన్‌కు దూరమవుతున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలకమైన ఇద్దరు ప్లేయర్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. లీగ్‌లో తొలి సగం మ్యాచులకు బ్యాటర్ రజత్ పాటిదార్ దూరం కానున్నాడట. స్టార్ బౌలర్ హేజిల్ వుడ్ లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సమాచారం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం రజత్ పాటిదార్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. మడమ గాయంతో బాధపడుతున్న అతడు.. ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. ఇంకో మూడు వారాల పాటు పాటిదార్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని సమాచారం. అంతే కాకుండా అతడు ఆర్సీబీ తరఫున ఆడాలంటే నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.
గతేడాది మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన రజత్ పాటిదార్‌ను అనూహ్యంగా ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఏడు మ్యాచులు ఆడిన పాటిదార్.. 333 పరుగులు సాధించాడు. టుప్లెసిస్, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.
మరోవైపు, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ కూడా సీజన్ మొత్తానికి దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. గాయాల బారిన పడిన అతడు ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్నాడు. గతేడాది మెగా వేలంలో రూ. 7.75 కోట్లుకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. 2023 సీజన్ మినీ వేలానికి ముందు అతడిని అట్టిపెట్టుకుంది.
అయితే ఇప్పటికే పలు జట్లకు చెందిన ఆటగాళ్లు సీజన్‌కు దూరమయ్యారు. వెన్ను గాయం కారణంగా ముంబయి స్టార్ పేసర్ బుమ్రా, కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ ఈ లీగ్‌కు అందుబాటులో ఉండట్లేదు. వీరితో పాటు ఇంకెవరు అందుబాటులో ఉండట్లేదో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.