IPL Media Rights Lalith Modi: నానాటికీ తన విలువను పెంచుకుంటూపోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ.48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31)లో మీడియా హక్కుల ద్వారా ఐపీఎల్ లక్ష కోట్ల రూపాయలు ఆర్జించడం ఖాయమని ఈ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ కుండబద్దలు కొట్టి చెప్పారు.
2023-27 కాలానికి గాను మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించిన నేపథ్యంలో లలిత్ మోదీ స్పందించారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.."ఐపీఎల్ విలువ నానాటికీ పెరుగుతోంది. 2008 నుంచి మీరు నా ఇంటర్వ్యూలు చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ డబుల్ అవుతుందని నేనెప్పుడో చెప్పా. గత సైకిల్ కంటే ఈసారి (2023-27 కాలానికి) అది 98 శాతం పెరిగింది. ఇక ఆ తర్వాత రాబోయే సైకిల్‌కు దాని విలువ డబుల్(రూ.లక్ష కోట్లు) అవుతుంది" అని అన్నారు.
లలిత్ మోదీ.. మహిళా ఐపీఎల్‌పై కూడా స్పందించారు. "ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒక మహిళా జట్టును కలిగి ఉండాలి. దీనివల్ల భారత మహిళా క్రికెట్ బలం పెరుగుతుంది. ఐపీఎల్ ద్వారా చక్కగా డబ్బులు సమకూర్చుకుంటున్న ఫ్రాంచైజీల యజమానులు మహిళా క్రికెట్‌పైన అప్పుడే పెట్టుబడులు పెడతారు" అని లలిత్ మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2008లో ఐపీఎల్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన లలిత్ మోదీ.. 2010 వరకు ఈ లీగ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. అయితే 2005-2010 మధ్య బీసీసీఐకి ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలో అతడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం వల్ల 2013లో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది.
ఇవీ చదవండి: టెన్నిస్ స్టార్‌కు యువతి మ్యారేజ్ ప్రపోజల్.. కోర్టులోనే..!