పది రోజుల క్రితం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ముంబయి ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 214 పరుగుల ఛేదనలో గెలిచేలా కనిపించిన రోహిత్ సేన.. చివరి ఓవర్లో 16 పరుగులు చేయలేక ఓటమిని అందుకుంది. ఇప్పుడు తాజాగా మొహాలీ వేదికగా ముంబయికి అదే ప్రత్యర్థితో మ్యాచ్. మళ్లీ దాదాపు అంతే లక్ష్యం. కానీ ఈ సారి ముంబయి పట్టు వదల్లేదు. అలా అని చివరి ఓవర్ వరకు కూడా మ్యాచ్‌ను తీసుకెళ్లలేదు. రసవత్తరంగా సాగిన ఈ పోరులో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి అదరగొట్టింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. గత మ్యాచ్ హీరో లివింగ్స్టన్ (42 బంతుల్లో 82 పరుగులు: 7x4, 4x6), జితేశ్ శర్మ (49: 5x4, 2x6) ముంబయి బౌలర్లపై దాడి చేశారు. ధావన్(30), మ్యాథ్యూ షార్ట్ (27), పరుగులతో రాణించారు. ఫలితంగా ముంబయి ముందు భారీ లక్ష్యాని ఉంచారు. ముంబయి బౌలర్లలో చావ్లా (2/29) ఆకట్టుకున్నాడు. గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఎక్స్‌ట్రాల రూపంలో ముంబయి బౌలర్లు 17 పరుగులు ఇచ్చుకున్నారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి జట్టులో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ఇషాన్ కిషన్ (75; 41 బంతుల్లో 7×4, 4×6), 'ఇంపాక్ట్ ప్లేయర్' సూర్యకుమార్ (66; 31 బంతుల్లో 8×4, 2×6) ధనాధన్ బ్యాటింగ్‌తో కొండంత లక్ష్యం చిన్నదైపోయింది. చివర్లో తిలక్ వర్మ(26 నాటౌట్; 10 బంతుల్లో 1×4, 3×6) , టిమ్ డేవిడ్ (19 నాటౌట్; 10 బంతుల్లో 3×4) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ముంబయి 4 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ బౌలర్లలో 'ఇంపాక్ట్ ప్లేయర్' నాథన్ ఎలిస్ (2/34) మెరిశాడు. అర్ష్‌దీప్ (1/66) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
మరోవైపు ఇదే బుధవారం జరిగిన లఖ్‌నవూ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం ఎక్కువై మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.